చలికాలంలో చర్మ సమస్యలు రావడం సహజమే. వాతావరణంలో మార్పులు చర్మ సమస్యలకి కారణాలవుతాయి. ఐతే చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు, అందంగా కనిపించకపోవడం మొదలైన సమస్యలతో పాటు పెదాల మీద ఏర్పడే పగుళ్ళు అధికంగా బాధపెడుతుంటాయి. సాధారణంగా చర్మంపై చూపించే శ్రద్ధ పెదాల మీద చూపించరు. చలికాలం వచ్చిందంటే పెదాలు ఎండిపోవడం, పగుళ్ళు ఏర్పడడం, వాటి నుండి రక్తం కారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఇలాంటి సమస్యలు రాకుండా పెదాలు ఆరోగ్యకరంగా ఉండడానికి పాటించాల్సిన చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ముందుగా పెదవులని అస్తమానం కొరకడం మానివేయాలి. మునిపంటి మీద పెట్టి పెదవులని కొరకడం, మాటి మాటికీ పెదాలను తడి చేయడం మానేయాలి. చలికాలంలో తరచుగా చేసే పనుల్లో ఇదే మొదటిది. దీనివల్ల పెదవుల సమస్యలు పెరుగుతాయి. తరచుగా పెదవులని తడి చేస్తూ ఉంటే పెదవుల్లో పగుళ్ళు ఏర్పడతాయి.
మీతో పాటు ఎల్లప్పుడూ లిప్ బామ్ ని వెంట ఉంచుకోండి. పొడిబారిపోయిన పెదవుల మీదకి తేమని చేర్చి ఆరోగ్యంగా తయారు చేయడానికి లిప్ బామ్ బాగా ఉపయోగపడుతుంది. చలికాలం లిప్ బామ్ వెంట తీసుకెళ్ళడం అస్సాలు మర్చిపోవద్దు.
రాత్రి పడుకునే ముందు ఆల్మండ్ ఆయిల్ ని పెదవులకి మర్దన చేసుకుంటే పెదవులు పొడిబారకుండా ఉంటాయి. అలాగే నెయ్యి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
చలికాలంలోనీరు తక్కువ తాగడం కూడా పెదాలు పొడిబారడానికి ఒక కారణం. రోజూ 7నుండి 8గ్లాసుల నీళ్ళు తాగితే శరీరంలో నీటి శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. నీరు ఎక్కువ తాగకపోవడమే అన్ని సమస్యలకి మూలం. అందుకే నీరు తాగడం మరవకండి.