తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి తెలంగాణ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలపడటమే లక్ష్యంగా ముందుకెళుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో అన్నీ జిల్లాల్లో బలపడాలని బీజేపీ భావిస్తుంది.
ఆ దిశగానే ఇప్పుడు బీజేపీ పనిచేస్తుంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ సీట్లలో సత్తా చాటాలి. సాధారణంగా ఎస్సీ, ఎస్టీలు బీజేపీకి అంత అనుకూలంగా ఉండరు. తెలంగాణలో వారు ఎక్కువగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, కమ్యూనిస్టుల పార్టీలకు సపోర్ట్‌గా ఉంటారు. అలాంటి స్థానాల్లో బీజేపీ సత్తా చాటడం అనేది చాలా కష్టమైన విషయం. రాష్ట్రంలో మొత్తం 31 ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో కనీసం 15 అయిన గెలుచుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా ఈ స్థానాల్లో బలం లేకుండా మిగిలిన స్థానాలపై ఆధారపడి బీజేపీ సత్తా చాటడం చాలా కష్టమైన పని. అందుకే ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రిజర్వడ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. మొదట ఈ స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించే యోచనలో తెలంగాణ బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల ఆయా నేతలే వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థులు అనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాడాటానికి సిద్ధమవుతున్నారు. ఇలా అన్నిరకాలుగా రిజర్వడ్ సీట్లపై ఫోకస్ చేసి బీజేపీ ముందుకెళుతుంది. మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.