శ్రీకృష్ణుడి రూపం- అనగానే భక్తుల మనసులో మెదిలే ఆకర్షణీయమైన చిత్రంలో, నెమలి పింఛం ఒక మకుటాయమానం! కేవలం అలంకరణ వస్తువుగా కనిపించే ఈ పింఛం వెనుక పరమాత్ముడు తన సృష్టి జీవనం గురించి చెప్పాలనుకున్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్మగలరా? ఆ నెమలి కన్ను (మచ్చ) దేనికి ప్రతీక? ప్రపంచాన్ని మురిపించిన కన్నయ్య ఆ సామాన్యమైన ఈకను కిరీటంగా ఎందుకు ధరించాడు? దాని వెనుక ఉన్న ఆ మధురమైన రహస్యాన్ని తెలుసుకుందాం..
నెమలి పింఛం – ప్రకృతికి, అందానికి ప్రతీక: శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడానికి ప్రధానంగా ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. అందులో ప్రకృతితో ఆయనకున్న అనుబంధం. కృష్ణుడు ప్రకృతిని ప్రేమించేవాడు, ఆయన బాల్యం గోకులంలో, వృందావనంలో పశువులు, పక్షులు, చెట్ల మధ్య గడిచింది. నెమలి అనేది వర్షానికి, సంతోషానికి, అత్యంత సహజమైన సౌందర్యానికి ప్రతీక. నెమలి పింఛం ధరించడం ద్వారా, ఆయన కేవలం ప్రకృతి పాలకుడు మాత్రమే కాదు, తాను ప్రకృతిలో ఒక భాగమని సమస్త సృష్టి ఆయన స్వరూపమని చాటి చెప్పాడు. ఆ పింఛంపై ఉండే రంగురంగుల వలయాలు (రంధ్రాలు) జీవిత చక్రంలో ఉండే వైవిధ్యమైన అనుభవాలకు, సంతోషాలకు, దుఃఖాలకు ప్రతీకగా చెబుతారు. ఈ వైవిధ్యంలోనే సంపూర్ణత్వం ఉంటుందని దాని అర్థం.

పురాణ కథ : త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, సీతాదేవి వనవాసంలో ఉన్న సమయంలో సీతాదేవికి దాహం వేసి నీరు కావాలని అడిగిందిట అప్పుడు శ్రీరామచంద్రుడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడుట, అకస్మాత్తుగా వారి ముందు ఒక అందమైన నెమలి కనిపించింది. శ్రీరాముడు నీరు ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడగ్గా ఆ నీరు ఎక్కడ ఉందో తనకు తెలుసునని తనని అనుకరించమని ఆ నెమలి చెప్పడంతో శ్రీరాముడు, సీత ఇద్దరు నెమలిని అనుకరించారు.
అడవిలో చెట్ల మధ్యలో ఉన్న మార్గాల గుండా వెళుతున్నప్పుడు నెమలి వెనుక వస్తున్న శ్రీరాముడికి దారి తెలియడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఆ ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల ఆ నెమలికి మరణం సంభవిస్తుందని తెలిసిన నెమలి మాత్రం ఈక లను వదలడం కొనసాగిస్తూనే ఉంది. చివరిగా వాళ్ళు అందమైన పూతోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకి దాహం తీర్చుకోవడానికి ఒక నది సరోవరం ఉంది, వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. కానీ నెమలి మాత్రం నేలపై పడి చనిపోయింది. దాని ఈకలన్నీ నేల రాలిపోయి చనిపోయిన కారణంగా శ్రీరాముడు నెమలి నిస్వార్ధమైన త్యాగానికి ముచ్చటపడి ఆ నెమలి తో నీ దయ, ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా చేయడమే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నెమలిని త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరించడం అనేది కేవలం ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్ కాదు, అదొక అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠం. ఇది మనకు, జీవితంలో సామరస్యాన్ని, సహజ సౌందర్యాన్ని అంగీకరించాలని, అత్యంత గొప్పదనం అనేది అహంకారంలో కాకుండా వినయం, ప్రేమ, ప్రకృతితో అనుబంధంలో ఉంటుందని చెబుతుంది. ఈ చిన్న పింఛం ద్వారా కృష్ణుడు మానవాళికి ధర్మం, సౌందర్యం యొక్క శాశ్వత విలువలను గుర్తుచేస్తూనే ఉంటాడు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే,ఈ సమాచారం వ్యక్తిగత నమ్మకాలపైనా ఆధారపడి వుంటుంది.