టాటా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి బెంగళూరుకు పయనమైన ఏ320ఎన్ఈఓ విమానం టేకాఫ్ అయిన 27 నిమిషాలకే తిరిగి ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. గాల్లో ఉండగానే విమానం ఇంజిన్ ఆగిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సమాచారం.
ఎయిర్ ఇండియాకు చెందిన ఏ320ఎన్ఈఓ విమానాలకు సీఎఫ్ఎమ్ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటుంది. ఆ ఇంజిన్లలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం ఉదయం 9:43 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలు దేరింది. గాల్లో ఉండగా.. ఇంజిన్ పని చేయడం ఆగిపోయిందని పైలెట్లు గుర్తించారు.
దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందిచారు. ఎయిర్ ఇండియా సంస్థ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని, తమ సిబ్బందికి ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే నైపుణ్యం ఉందన్నారు.