ఎక్కడైనా అధికార పార్టీ నేతపై ఆరోపణలు వస్తే.. ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడతాయి. ప్రెస్‌మీట్లు పెట్టి మరీ దుమ్మెత్తిపోస్తాయి. కానీ ఈటల రాజేందర్ విషయంలో ప్రతిపక్షాలే అండగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఇదే పెద్ద ట్విస్టు. అన్ని పార్టీలూ ఈటలకు మద్దతుగా నిలుస్తున్నాయి. తమ పార్టీల్లోకి వస్తే.. సీఎం క్యాండిడేట్ అని, పార్టీ కీలక పదవి ఇస్తామని ఇలా.. బహిరంగంగానే నేతలు ఆఫర్లు ఇస్తున్నారు.
ఇక టీఆర్ ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఈటల రాజేందర్ అలా ప్రకటించాడో లేదో.. ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ తమవైపు లాగేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాయి. ఇప్పటికే రఘునందన్ రావు బీజేపీలోకి రావాలంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆహ్వానిస్తున్నారు. ఆయనే కాదు ఆ పార్టీ పెద్దలు కూడా ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్ట్ గా చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఈటల కాంగ్రెస్ లోకి వస్తే బాగుంటుందని మీడియా సమక్షంలోనే ఆఫర్ ఇచ్చారు. బలమైన బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలలో పట్టున్న ఈటలను తమ పార్టీలో చేర్చుకుంటే బీసీల అండ దొరుకుతుందని అన్ని పార్టీలూ వెంపర్లాడుతున్నాయి. కానీ ఈటల మదిలో ఏముందో ఇప్పటికీ తెలుపలేదు. ఆయన వేరే పార్టీలో చేరనని, కొత్త పార్టీ పెట్టనని చెప్పినా.. ఇవన్నీ వ్యూహాత్మమేనని తెలుస్తోంది. హుజూరాబాద్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఈటల త్వరలో భవిష్యత్ ప్రకటించే అవకాశం ఉంది.