సాధారణంగా ఏ కంపెనీ అయినా లేదా బ్యాంకు నుంచి అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటే ఇంతకు ముందు వరకు సులభంగా ఇచ్చేవారు. గతంలో మెడికల్ టెస్టులను చేయించేవారు. కానీ కంపెనీలకు భారం పడుతుండడంతో టెస్టులు లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్‌తో హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నారు. అయితే కోవిడ్ వల్ల ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ పొందడం కష్టంగా మారింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలంటే కోవిడ్ లేదని, గత 30 రోజుల వ్యవధిలో క్వారంటైన్‌లో కూడా లేమని డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపాలి. అవసరం అయితే టెస్టులను కూడా చేయించుకోవాలి. అయితే కోవిడ్ బారిన పడి కోలుకున్నా, క్వారంటైన్‌లో ఉన్నా.. ఆ వివరాలను ధ్రువీకరిస్తే ఇన్సూరెన్స్ తీసుకున్నాక కొన్ని నెలల పాటు ఆగాల్సి వస్తోంది. కంపెనీని బట్టి ఈ కాల వ్యవధి భిన్నంగా ఉంటోంది.
కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. గుండె, లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారికి హెల్త్ ఇన్సూరెన్స్‌ను అందించేందుకు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక వేళ ఇన్సూరెన్స్‌ను ఇచ్చినా కొన్ని నెలల పాటు ఆగాల్సి వస్తోంది. దీన్నే కూల్-ఆఫ్ పీరియడ్ అంటున్నారు. ఈ కూల్-ఆఫ్ పీరియడ్ కంపెనీని బట్టి మారుతుంది.
కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు కూల్-ఆఫ్ పీరియడ్‌ను 3 నెలలుగా నిర్ణయించాయి. కొన్ని 6 నెలలుగా నిర్ణయించాయి. అంటే కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది యాక్టివ్ అయ్యేందుకు అన్ని నెలల పాటు ఆగాల్సి ఉంటుందన్నమాట. వారిలో అనారోగ్య సమస్యలు వస్తున్నందునే అలాంటి వారిని రిస్క్‌గా భావిస్తున్న సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు పైన తెలిపిన విధంగా షరతులను విధిస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితే మళ్లీ యథావిధిగా హెల్త్ ఇన్సూరెన్స్‌లను అందించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.