జీర్ణక్రియ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలకి దూరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
బొప్పాయి
రాత్రి పడుకుని పొద్దున్న లేవగానే మొదటగా తీసుకునే ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాదాపు 8గంటల పాటు కడుపులో ఏమీ ఉండదు కాబట్టి, మొదట తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బొప్పాయి ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది.
అపిల్
ఆపిల్ లో విటమిన్ ఏ, సి ఉంటాయి. అవేగాక అనేక ఖనిజాలు, పొటాషియం ఉంటుంది. వీటి కారణంగా జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. అంతే కాదు అధిక శాతం ఫైబర్ ఉండడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు.
దోసకాయ
దోసకాయలో ఎరిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియని ఆరోగ్యకరంగా చేస్తుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలని దూరం చేయడంలో దోసకాయ పాత్ర చాలా కీలకం.
అరటి పండు
అరటి పండు జీర్ణక్రియకి ఎంత మంచిదో అందరికీ తెలుసు. ఇందులో ఉండే ఫైబర్ శాతం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేసేటపుడు అందులో అరటి పండుని భాగంగా చేసుకోవడం ఉత్తమం.
తేనె- నిమ్మరసం
నిమ్మరసం నీళ్ళలో తేనె కలుపుకుని పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది.