వైసీపీ పార్టీకి ఎట్టకేలకు మంచి రిలీఫ్ దక్కింది. ఇప్పటి వరకు వరుస సమస్యలతో సతమతమవుతున్న నేతలకు ఢిల్లీ హైకోర్టు తీర్పు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. వరుసగా ఎంపీ రఘురామ విషయంలో వైఎస్‌జగన్ ప్రభుత్వానికి, పార్టీకి కొన్ని షాక్‌లు తగిలాయి. ఇక జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్సార్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఆ పిటిషన్ అసంబద్ధమైనదని, విచారణకు అది అర్హత సాధించలేదని ధర్మాసనం వెల్లడించింది. వైఎస్సార్ అనే పదం తమకే చెందుతుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ గతంలో అన్న వైఎస్సార్ పార్టీ నేతలు పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు శుక్రవారం విచారణ జరిపి, వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అన్న వైఎస్సార్ నేతలు తప్పుడు ఉద్దేశాలతో పిటిషన్ వేశారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో వైసీపీలో ఫుల్ జోష్ నెలకొంది. కేడర్ సంబురాలు చేసుకుంటున్నారు.