కోవిడ్ వ్యాక్సిన్ కోసం హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఇ సంస్థతో కేంద్రం ఒప్పందం చేసుకున్న విషయం విదితమే. రానున్న రోజుల్లో మొత్తం 30 కోట్ల డోసులకు గాను కేంద్రం రూ.1500 కోట్లను ఆ సంస్థకు ఇవ్వనుంది. ఇక భారత్‌లో తయారైన రెండో కోవిడ్ వ్యాక్సిన్‌గా ఈ వ్యాక్సిన్ పేరుగాంచనుంది. దీనికి ఇప్పటి వరకు నామకరణం చేయకపోయినా భారత్ లో అత్యంత చవకైనా వ్యాక్సిన్‌గా ఈ వ్యాక్సిన్ గుర్తింపు పొందనుంది. ఈ వివరాలను బయోలాజికల్-ఇ ఎండీ మహిమా దాట్ల వెల్లడించారు.
బయోలాజికల్-ఇ సంస్థ హూస్టన్‌లోని బేయ్‌లర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి నూతన కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. ఈ వ్యాక్సిన్‌కు గాను జంతువులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలోని 15 చోట్ల 40 రోజుల కిందటే ఈ వ్యాక్సిన్‌కు మనుషులపై 3వ దశ ట్రయల్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా 18 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 1000 మందికి పైగా వాలంటీర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొంటున్నారు. ఇవి పూర్తయ్యేందుకు మరో రెండు నెలలు పట్టేందుకు అవకాశం ఉంది.
ఇక బయోలాజికల్-ఇ తయారు చేసిన వ్యాక్సిన్‌కు ఆగస్టు నెలాఖరు వరకు ట్రయల్స్ పూర్తయితే సెప్టెంబర్ నుంచి టీకాలు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఆ సంస్థ మొత్తం 30 కోట్ల టీకా డోసులను కేంద్రానికి సరఫరా చేస్తుంది.
కాగా బయోలాజికల్-ఇ కోవిడ్ వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో ఇస్తారు. దీన్ని తీసుకున్న వారిలో కోవిడ్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య గడువును 28 రోజులుగా నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ధర రూ.50గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదే ధరకు ఈ టీకాను విడుదల చేస్తే దేశంలో అత్యంత చవకైన కోవిడ్ వ్యాక్సిన్‌గా ఈ టీకా గుర్తింపు పొందుతుంది.