యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ… ఈ పార్టీ పుట్టి నేటికి పదేళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీకి శ్రీకారం చుట్టి నేటికి పదేళ్ళు అవుతుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2011 మార్చి 12న జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భవించింది. వైఎస్ మరణం తర్వాత గుండె పోటు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చడానికి అడుగులు వేసిన జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహానికి గురై పార్టీకి శ్రీకారం చుట్టారు.
పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక సంచలనాలు. కాంగ్రెస్ లో మంత్రులుగా ఉన్న ఎందరో జగన్ ని నమ్మి ఈ పార్టీలోకి అడుగు పెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ కోసం తమ పదవులను వదులుకున్నారు. 2014 ఎన్నికల్లో 60 సీట్లతో పరిమితం అయిన ఈ పార్టీ 2019 ఎన్నికల్లో ఊహకు అందని విజయాన్ని నమోదు చేసింది. ఈ పదేళ్ళ ప్రయాణంలో ఆ పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
జగన్ జైలుకి వెళ్ళడం, 2014 లో అధికారంలోకి రాకపోవడం, అయినా సరే జగన్ మొండి పట్టుదలతో పార్టీని ముందుకి నడిపించారు. కేద్రం ఇబ్బందులు పెడుతున్నా రాష్ట్రంలో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన పార్టీ ఉన్నా సరే ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. ఎవరికి భయపడలేదు… రాష్ట్రాన్ని నేడు పాలిస్తూ సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా తన పార్టీ ఆవిర్భావం పై జగన్ కాస్త భావోద్వేగ ట్వీట్ చేసారు.
మహానేత ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైసీపీ రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈసుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్రప్రజలందరికీ వందనాలు.ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీఅందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేసారు. అన్ని పార్టీ కార్యాలయాల్లో నేడు పార్టీ జెండాను ఎగురవేయనున్నారు.