గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. అంచనాకు మించి రికార్డు స్థాయిలో నీటిమట్టం చేరింది. భారీగా వరదలు పోటెత్తడంతో వరద నీరు 67.10 అడుగులకు చేరింది. దిగువకు 22.03, 857 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెబుతున్నారు.
ఈ మేరకు కలెక్టర్ అనుదీప్ శాంతినగర్ కాలనీలో పర్యటించారు. భద్రాచలం నలువైపులా వరద చుట్టు ముట్టడంతో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ వద్ద నేషనల్ హైవే 30 రహదారిపై గోదావరి నీరు ప్రవహిస్తోంది. నేషనల్ హైవేపై వరద ముంచెత్తడంతో పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 62 గ్రామాలకు చెందిన 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.