కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్ళుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నిన్న సాయంత్రం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇక రాజకీయ యవనికపై ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత సృష్టించిన సంచలనాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. దేశంలోని ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఐదు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు.
గతేడాది రాంవిలాస్ పాశ్వాన్ రాజకీయాల్లో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. 1969లో తొలిసారి ఆయన బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదుగురు ప్రధానుల కేబినెట్‌లో ఆయన కేంద్రమంత్రిగా పని చేసిన అరుధైన్ కేంద్ర మంత్రి ఆయన. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లి వచ్చారు. 1977లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. . ఆ తరువాత కూడా వరుసగా విజయాలు సాధించారు. 8 సార్లు లోక్సభ నుంచి ఆయన ఎంపీ అయ్యారు. 1989లో నాటి ప్రధాని వీపీ సింగ్ కేబినెట్‌లో కార్మిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఆ తరువాత మాజీ ప్రధాని వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2000 సంవత్సరంలో జనతాదళ్ నుంచి బయటకు వచ్చిన రాంవిలాస్ పాశ్వాన్. లోక్ జనశక్తి పార్టీని ఏర్పాటు చేసి… 2004 ఎన్నికల అనంతరం నాటి యూపీఏ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో పరాజయం పాలైన పాశ్వాన్… 2014 ఎన్నికల్లో విజయం సాధించి అనంతరం ప్రధాని మోడీ కేబినెట్‌లో మంత్రి అయ్యారు.
2019 తరువాత కూడా ఎన్డీయేలోనే కొనసాగుతూ… మరోసారి మోడీ కేబినెట్‌లో మంత్రిగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఎంపీగా ఉన్నారు. ఇన్నేళ్ళు వరుసగా కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆయన అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. బలమైన నేత కావడంతో ఆయనకు ముందు నుంచి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.