జీవితాన్ని మరింత ఆనందప్రదంగా ముందుకు తీసుకెళ్ళడానికి స్నేహితుల అవసరం చాలా ఉంది. ఎవరితో స్నేహం లేకుండా బ్రతకవచ్చేమో కానీ జీవించలేరు. అవును, మీకు సరైన స్నేహితులు ఉంటే మీ జీవితం సరైన దిశలో వెళ్తుంది. లేదంటే చతికిలపడి గతుకుల రోడ్డులో కష్టపడుతుంది. అందుకే మీ జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉన్నారనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఫేక్ ఫ్రెండ్స్ ( Fake Friends ) ఏ విధంగా ఉంటారో తెలుసుకుంటే బాగుంటుంది. ఫేక్ ఫ్రెండ్స్ లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
ఏదో ఒక అవసరం ఉంటేనే కాల్ చేస్తారు
చాలా రోజుల తర్వాత కాల్ చేసి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావ్ అని అడిగి, పాయింట్ కి వచ్చేస్తారు. వారి అవసరం చెప్పి, అది తీర్చమని అడుగుతారు. మళ్ళీ వీరి నుండి కాల్ వచ్చినా అది ఏదో ఒక అవసరం కోసమే అయి ఉంటుంది.
ఫేక్ ఫ్రెండ్స్ గౌరవం ఇవ్వకపోవడం
టీజింగ్, ఆటపట్టిస్తున్నట్లుగా అసౌకర్యంగా ప్రవర్తించడం, తిట్టడం లాంటివన్నీ మీకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఏదో ఒక్కసారి హాస్యం కోసం ఫర్వాలేదు గానీ, ప్రతీసారీ అదే పనిగా చేస్తుంటే ఆలోచించాల్సిందే. దీని వెనక సైకలాజికల్ కారణాలు చాలా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
మీ గురించి మరీ ఎక్కువగా అడుగుతారు
అవతలి వారి జీవితాల మీద వీళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మీ జీవితంలో ప్రతీ చిన్న విషయం గురించి చెప్పాలని అనుకుంటారు. చెప్పమని ఒత్తిడి చేస్తారు. అలాగే అవతలి వారి గురించి మీ దగ్గర చర్చిస్తారు.
తప్పించుకోవడం
ఫేక్ ఫ్రెండ్స్ వారికి హాని కలగనంత వరకు మాత్రమే మీతో ఉంటారు. వారి అవసరం తీరిందని అనుకున్నప్పుడు నిర్లక్ష్యంగా మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు.
మీ అవసరంలో వారు కనిపించరు.
ఉదాహరణకి వారు ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు మీ సహాయాన్ని తీసుకుంటారు. అలాగే మీకు అవసరం వచ్చినపుడు వారి ఫోన్ స్విఛాఫ్ అని చెప్తుంది. ఇది పెద్ద పెద్ద విషయాల్లో చాలా సీరియస్ గా ఉంటుంది.