తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలే చాలా విచిత్రంగా ఉంటాయి. ఏ పార్టీలో లేనన్ని లుకలుకలు ఆ పార్టీలోనే ఉంటాయి. ఇంతకు ముందు బీజేపీకి బండి సంజయ్‌ను ప్రెసిడెంట్ గా చేస్తే ఆయనకు పార్టీలో ఉన్న వారంతా సపోర్టు చేశారు. అందరూ కలిసి వచ్చి పెద్ద ఎత్తున సభ నిర్వహించి కలిసి కట్టుగా పోరాడుతామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) విషయంలో మాత్రం అంతా రివర్స్‌లో జరుగుతోంది.
ఇప్పటికే ఆయన్ను ప్రెసిడెంట్‌ను చేస్తే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లు ఆయన్ను వ్యతిరేకిస్తుంటే ఇంకొందరేమో ఏకంగా రాజీనామాల దాకా వెళ్లారు. మరీ ముఖ్యంగా పార్టీకి పట్టుకొమ్మల్లాంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు లాంటి వారు వ్యతిరేకించడమే ఆయనకు పెద్ద దెబ్బగా మారుతోంది.
ఏకంగా రేవంత్ కలుస్తానని కోరుతున్నా వారు మాత్రం కలవొద్దని చెబుతున్నారు. ఇంకొందరు కావాలనే అందుబాటులో లేమని, తమ ఇంటికి రావొద్దని కోరడం రేవంత్ రెడ్డికి పెద్ద అవమానంగా మారుతోంది. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం సొంత సమస్యలతోనే ఇలా ఉంటే చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్‌కు ఇతర పార్టీల కంటే పెద్ద సవాళ్లు ఎదురవడం కలవర పెడుతోంది.