తిరుపతిలో శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తాజాగా స్పందించారు. మృతుల వివరాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను ఆయనకు మీడియాకు వెల్లడించారు. గేట్లను ఒక్కసారిగా తెరవడంతో చాలా సేపటి నుంచి వేచిచూస్తున్న భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారని, ఆ సమయంలో సుమారు 2 వేల మంది ప్రజలు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు.
దీంతో అదుపుతప్పి ఒకరిపై మరొకరు పడిపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. ఆరుగురు మృతుల్లో కేరళకు చెందిన ఒక మహిళ ఉన్నారని, మిగిలిన ఐదుగురు వైజాగ్, నర్సీపట్నంకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. తొక్కిసలాటలో గాయపడిన మరో 35 మంది భక్తులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.