తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. నర్సీ పట్నానికి చెందిన బి.నాయుడు బాబు(51), విశాఖకు చెందిన రజిని(47), లావణ్య(40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక(49), మరణించినట్టు గుర్తించారు. ఈ తొక్కిసలాటలో మరో 48 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
తిరుపతి తొక్కిసలాట ఘోరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులు ఎవ్వరో తేల్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరుగకుండా జాగ్రత్త పడ్డాం. అధికారులతో టీటీడీ సరిగ్గా పని చేయించడం లేదని.. పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటుందన్నారు. భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వై.వీ. సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.