టీడీపీని నేతల వరుస మరణాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నేతల మృతి ఆ పార్టీకి తీరనిలోటుగా మారుతోంది. రోడ్డు ప్రమాదాల్లో కొందరు మరణిస్తే.. మరికొందరు ప్రత్యర్థులు చేతిలో హత్యకు గురయ్యారు. ఇంకొందరు హఠాన్మరణాలకు గురయ్యారు. తాజాగా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. వీరందరూ కూడా పార్టీ ఆవిర్భావం అంటే.. 1983 నుంచి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఎదిగినవారే కావడం గమనార్హం. జిల్లాల్లో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దినవారే. వారి మరణాలతో పార్టీ పట్టుకోల్పోతోంది. పార్టీ కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది.
కడప జిల్లాలో మంచి పట్టున్న నేత శివారెడ్డి. ఎన్టీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు వచ్చిన ఆయనను బాంబులతో ప్రత్యర్థులు హతమార్చారు. 1994 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత తెలంగాణలో మంచి పట్టున్న నేత నల్లగొండకు చెందిన ‘మాధవరెడ్డి’ని నక్సల్స్ హతమార్చారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఈ ఘటన చోటుచేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఘటన కలకలం రేపింది.
అదే విధంగా ఎదుగుతున్న మరో నేత దేవినేని రమణ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. ఇలా కీలక నేతల మరణాలతో ఆయా ప్రాంతాల్లో టీడీపీకి తీరని నష్టం జరిగింది. పార్టీ కోలుకోలేకపోయింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన బాలయోగి టీడీపీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో పార్టీ శ్రేణులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
2005 అసెంబ్లీ ఎన్నికల తరువాత అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవి హత్య కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలోనే ఆయనను ప్రత్యర్థులు హతమార్చారు. పరిటాల రవి మరణంతో అనంతపురం జిల్లాలో పార్టీ పట్టుకోల్పోయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌నేత ‘ ఎర్రంనాయుడు ‘, గుంటూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత ‘ లాల్‌జాన్‌భాషా ‘, మాజీ మంత్రి ‘ హరికృష్ణ ‘ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరందరు కూడా పార్టీలో పట్టున్న నేతలు. ప్రజల్లో ఆదరణ పొందినవారు. ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ కోలుకోలేకపోతోంది.