పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి మొదటి నుంచి కంచుకోటగా రాజకీయ ప్రసిద్ధి పొందింది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో ఈ జిల్లా భాగస్వామ్యమే కీలకంగా మారింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ జిల్లాలో తేలిపోయింది. ముఖ్యమైన నేతలు కూడా ఓటమిపాలవడంతో పార్టీ సంస్థాగతంగా చెల్లచెదురవుతోంది. దీనికితోడు ఎన్నాళ్లుగానే పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా తమ దారి తాము చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
జిల్లా రాజకీయాల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానిలు ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ పరిస్థితి అంపశయ్యపై అన్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా జిల్లాల్లో మకాం వేస్తూ శ్రేణుల్లో నిబ్బరం నింపే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. ఆ కోవలోనే ఆయన మూడు రోజులు పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ సమీక్షలతో నిమగ్నమయ్యారు.
గంటా పార్టీ మారుతారని గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఇప్పటికీ ఆయన మాత్రం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గంటా పార్టీ మారితే పులపర్తి కూడా కండువా మార్చేస్తారని టీడీపీ వర్గాల్లో కూడా అభిప్రాయం వెలువడుతోంది. ఈలి నాని విషయానికి వస్తే.. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతోనే దోస్తీ కట్టడం గమనార్హం.
ఆయన కారులోనే నాని దర్శనమిస్తుండటం టీడీపీ శ్రేణులను కలిచివేస్తోందంట. పార్టీ మారే ఉద్దేశం ఉండటంతోనే ఆయన మంత్రితో బహిరంగంగా తిరుగుతున్నారని టీడీపీ శ్రేణులు చెప్పుకొంటున్నాయి. పార్టీ సమీక్షకు దూరంగా ఉండటం వెనుక అసలు కారణమిదేనని అభిప్రాయపడుతున్నాయి. ఇద్దరు కీలక నేతలు సైకిల్ దిగి..ఫ్యాన్ గాలి కిందకు చేరుతారో లేదా అన్నది వేచి చూడాలి .