పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల పలు దశల్లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో గెలిచేందుకు బీజేపీ సర్వ శక్తులను ఒడ్డింది. ఎత్తుకు పై ఎత్తులను వేసింది. అయినప్పటికీ దీదీ ప్రభంజనం ముందు బీజేపీ నిలబడలేకపోయింది. అయితే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో వ్యూహాలు అనుసరించినప్పటికీ బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది ? ఎక్కడ బెడిసి కొట్టింది ? అనే కారణాలను ఒక్కసారి విశ్లేషిస్తే…
పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీ సీఎం అభ్యర్థిగా దీదీ ఉన్నారు. కానీ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. బెంగాల్‌కు చెందిన వారే సీఎం అవుతారని బీజేపీ పెద్దలు చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో సీఎం అభ్యర్థులను ప్రకటిస్తేనే పలు పార్టీలు గెలిచాయి. సీఎం అభ్యర్థి ఏ పార్టీకైనా నాయకుడిలా ఉంటాడు. అతన్ని చూసి ఓటు వేస్తారు. కానీ బెంగాల్‌లో బీజేపీ అలా చేయలేదు. ఇది బీజేపీ ఓటమికి గల కారణాల్లో ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక బెంగాల్‌లో ముస్లిం ఓటర్లు అందరూ టీఎంసీ వైపే నిలబడ్డారని, వారందరూ ఆ పార్టీకే ఓటు వేశారని, అందుకే టీఎంసీ అద్భుత విజయం సాధించిందని, బీజేపీ ఓటమికి గల కారణాల్లో ఇది ఒకటని అంటున్నారు. అలాగే దీదీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అక్కడ బీజేపీ నుంచి సువేందు అధికారి గట్టి పోటీ ఇస్తారని తెలుసు. ఆమె భవానిపుర్‌లో సులభంగా గెలవగలరు. అయినప్పటికీ టీఎంసీ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే ఆమె అక్కడి నుంచి పోటీ చేశారని తెలుస్తోంది. దీని వల్ల ఆ పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా పని చేసింది. తమ పార్టీకి ఎన్నికల్లో బలం తెచ్చి పెట్టింది. ఫలితంగా టీఎంసీ విజయం సాధించింది. కనుక బీజేపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.
ఇక చివరిగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న ప్రధాని మోదీ పట్టించుకోలేదనే విమర్శ ఉంది. దీని వల్ల చాలా మంది బీజేపీకి ఓటు వేయలేదని సమాచారం. ఫలితంగా పశ్చిమ బెంగాల్‌లో దీదీ మరోసారి సీఎం అవనున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను సాధించింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.