టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది.. ఒకప్పుడు మనం చూసిన ఊరికి ఇప్పుడు మనం చూస్తున్న ఊరికే పొంతన లేదు.. అన్నీ మారిపోయాయి.. ఇక ప్రపంచం మారకుండా ఉంటుందా. ఒకప్పుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటండి అనేవాళ్లు.. ఇప్పుడు అదే రోడ్డుకు ఇరువైపులా.. సోలార్ ట్రీస్ వచ్చేశాయి.. మనుషుల వాడకం తగ్గుతుంది.. మనిషే మనిషితో పనిలేకుండా జరిగేపోయే యంత్రాలను, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ను కనుక్కుంటున్నాడు. ఇంతకీ ఈ సోలార్ ట్రీస్ సంగతేంటో చూద్దామా..!
గుజరాత్ రాజధాని గాంధీనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చేందుకు గాంధీనగర్ మెట్రోపాలిటన్ మున్సిపాలిటీ గట్టిగా ప్రయత్నిస్తోంది. గాంధీనగర్‌లో విపరీతమైన ఎండ. అందుకే.. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెడుతూ.. ఎండను ఎలా వాడుకోవాలో అలా వాడేస్తున్నారు. వివిధ పబ్లిక్ పార్కులలో 20 సోలార్ చెట్లను ఏర్పాటు చేశారు. ఏడాది పొడవునా ఈ సోలార్ చెట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కరెంటును టొరెంట్ పవర్ లేదా ప్రభుత్వ విద్యుత్ కంపెనీకి అమ్మేలా అక్కడి అధికారులు ప్లాన్ చేశారు.
ఒక్కో చెట్టు రోజుకు 4660 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 20 సోలార్ చెట్లు ఏడాది పొడవునా రూ. 1.25 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అయ్యి.. పర్యావరణ కాలుష్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది. ఎందుకంటే సోలార్ చెట్టు పరిమాణం చాలా పెద్దది, ఇది నిజమైన పెద్ద చెట్టులా ఉంటుంది. ఒక పెద్ద పొద్దుతిరుగుడు ఆకుపై సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు ఉంటుంది. 15 నుండి 20 ఆకుల లాంటి ప్యానెల్స్ ఉండటం వల్ల ఈ సోలార్ చెట్టు నీడను కూడా అందిస్తుంది.
గాంధీనగర్‌లోని వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ చెట్లు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఈ సోలార్ ట్రీ.. కాలుష్యాన్ని తగ్గిస్తూ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసేస్తారు.