చైనాకు చెందిన మైక్రో లెండింగ్ యాప్ మొనీడ్ (Moneed) ను వాడుతున్న 35 కోట్ల మంది భారతీయుల డేటా చైనా సర్వర్లలో ఉన్నట్లు తేలింది. ఆ డేటాను కావాలనే చైనా సర్వర్లలో ఉంచారా, లేక డేటాను లీక్ చేశారా.. అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని సెక్యూరిటీ రీసెర్చర్ అనురాగ్ సేన్ ముందుగా పసిగట్టి సదరు కంపెనీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. అయితే మొదట్లో ఆ కంపెనీ స్పందించకపోయినా.. తరువాత సమస్యను పరిష్కరించామని తెలిపింది.
అయితే మొనీడ్‌లోని భారతీయుల డేటా చైనా సర్వర్లలో లేదని, ముంబై సర్వర్‌లో ఉందని ఆ కంపెనీ స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ ఆ యాప్‌ను వాడే యూజర్లకు చెందిన డేటా చైనా సర్వర్లలో ఇప్పటికీ ఉందని సెక్యూరిటీ రీసెర్చర్లు చెబుతున్నారు. ఇక యాప్‌లోని యూజర్లకు చెందిన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో కూడిన డేటా చైనా సర్వర్‌లలో ఉందని అంటున్నారు. సదరు యాప్ కు యూజర్ల ఫోన్లకు చెందిన వైఫై నెట్‌వర్క్‌లు, ఫోన్ స్టోరేజీలను యాక్సెస్ చేసే పర్మిషన్ ఉందని, అందువల్ల దాని సహాయంతో హ్యాకర్లు ఫోన్ వైబ్రేషన్‌ను కంట్రోల్ చేయవచ్చని, ఫోన్ నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో యాక్సెస్ చేయవచ్చని, ఫోన్ స్టోరేజ్‌లో ఉండే కంటెంట్‌ను రీడ్ చేయవచ్చని, కాంటాక్ట్‌లను యాక్సెస్ చేసి వాటిని మోడిఫై చేయవచ్చని కూడా తేలింది.
కాగా తమ యాప్‌ను వాడుతున్న యూజర్ల డేటా భద్రంగా ఉందని, అది లీక్ కాలేదని, అత్యంత శక్తివంతమైన ఫైర్‌వాల్, సెక్యూరిటీలను ఏర్పాటు చేశామని మొనీడ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే మొనీడ్‌తోపాటు ప్లే స్టోర్‌లో ఉన్న మరో యాప్ మోమో కూడా ఆ యాప్ మాదిరిగానే యూజర్ల డేటాను కలెక్ట్ చేసి చైనా సర్వర్లలో స్టోర్ చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చైనా యాప్ భారత్‌లో ఇంకా ఎలా పనిచేస్తుందనే విషయంపై కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది.