మనిషి మాట్లాడాలంటే స్వర పేటిక ఎంతగానో అవసరం.. కానీ గొంతు క్యాన్సర్ వల్ల దాన్ని తొలగిస్తే ఇక ఆ బాధితులు మళ్లీ మాట్లాడలేరు. కానీ అలాంటి వారికి నేనున్నానని ఆ డాక్టర్ ధైర్యం చెబుతున్నారు. అంతేకాదు.. ఓ ప్రత్యేకమైన పరికరం సహాయంతో పోయిన గొంతును వారికి తిరిగి తెప్పిస్తున్నాడు. వారు మళ్లీ మాట్లాడేలా చేస్తున్నాడు. ఆయనే బెంగళూరుకు చెందిన డాక్టర్ విశాల్ రావు.
డాక్టర్ విశాల్‌రావు బెంగళూరులోని హెల్త్‌కేర్ గ్లోబల్ క్యాన్సర్ సెంటర్ అనే హాస్పిటల్‌లో హెడ్, నెక్ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన గొంతు క్యాన్సర్ ద్వారా స్వరపేటిక తొలగించబడిన బాధితుల కోసం ఓం వాయిస్ ప్రోస్థసిస్ అనబడే ఓ పరికరాన్ని తయారు చేశారు. 2015లోనే ఈ డివైస్‌ను ఆయన రూపొందించారు. అప్పటి నుంచి ఎంతో మంది గొంతు క్యాన్సర్ బాధితులకు ఈ పరికరాన్ని అమర్చి, పోయిన వారి గొంతును తిరిగి తెప్పిస్తున్నారు. వాళ్లు మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుతున్నారు.
అయితే సాధారణంగా ఇలాంటి పరికరాల ధర మార్కెట్‌లో రూ.30వేల వరకు ఉంటుంది. కానీ డాక్టర్ విశాల్ రావు.. మొదట్లో ఈ పరికరాన్ని కేవలం రూ.50కే అందజేశారు. అయితే ఈ పరికరాలను తయారు చేసేందుకు కావల్సిన డబ్బు తన వద్ద లేకపోవడంతో మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఆయన పలు ఎన్‌జీవోల సహాయంతో ఆ పరికరాలను తయారు చేసి బాధితులకు అందివ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పరికరం ధర రూ.3వేలు. అయినప్పటికీ మార్కెట్‌లో లభించే ఇలాంటి కృత్రిమ పరికరాలతో పోలిస్తే ఓం వాయిస్ ప్రోస్థసిస్ ధర 85 శాతం తక్కువ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఎంతో మంది ఈ పరికరం ద్వారా తిరిగి స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. గొంతు క్యాన్సర్ వల్ల తమ గొంతును పోగొట్టుకున్నా తిరిగి ఈ పరికరంతో గొంతును పొందుతున్నారు. వారి కోసం ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినందుకు డాక్టర్ విశాల్ రావుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!