వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే.. డబ్బులు ఇస్తారు

-

మనిషి వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం మనిషి చేస్తున్న అనేక తప్పుల వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతోంది. ముఖ్యంగా మనిషి వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. దీంతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ఇక అనేక దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని బాగా తగ్గించడంతోపాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడడాన్ని పూర్తిగా నిషేధించారు. అయితే ఈ విషయంలో ఈక్వెడార్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. అదేమిటంటే…

ఈక్వెడార్‌లోని గయాకిల్ అనే నగరం దాదాపుగా 2.7 మిలియన్ల జనాభాను కలిగి ఉంటుంది. అయితే ఆ దేశవ్యాప్తంగా ఆ నగరంలోనే ఎక్కువగా చెత్త, వ్యర్థాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. దీంతో ఆ నగరం డర్టీగా మారింది. ఈ క్రమంలో తమ నగరాన్ని పరిశుభ్రంగా మార్చుకునేందుకు ఈక్వెడార్ ఒక వినూత్న ఆలోచన చేసింది. అందులో భాగంగానే అక్కడ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించడం కోసం వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఇస్తే డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు.

గయాకిల్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ ప్లాస్టిక్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే డబ్బులు ఇస్తున్నారు. అలా ఒక బాటిల్ ఇస్తే 2 సెంట్లు ఇస్తారు. 15 బాటిల్స్‌కు 30 సెంట్లు లభిస్తాయి. దాంతో మెట్రో టిక్కెట్ కొనుగోలు చేసి వెళ్లవచ్చని అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో చాలా మంది వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌ను కలెక్ట్ చేసి రీసైక్లింగ్ మెషిన్‌ల వద్ద బారులు తీరి మరీ వాటిల్లో ఆ బాటిల్స్‌ను డిపాజిట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. కాగా ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోందని ఈక్వెడార్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఎన్నో టన్నుల ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఇలా తొలగించామని, ఇప్పుడు నగరంలో కొంత వరకు ప్లాస్టిక్ ప్రభావం తగ్గిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ప్లాస్టిక్ నిర్మూలన కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని అందరం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version