మ‌హిళ‌ల‌కు వీరు ఆద‌ర్శం.. లోదుస్తుల విక్ర‌యాల‌తో పాపుల‌ర్‌..!

-

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మ‌హిళ‌ల‌కు కూలి ప‌నులు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఉపాధి ఉంటుంది. ఎప్పుడూ ప‌ని ఉండ‌దు క‌నుక చాలా రోజుల పాటు ఖాళీగా ఉంటారు. అయితే వారికి ఎప్పుడూ ప‌ని ల‌భిస్తే వారి జీవితాలు ఇంకా మెరుగుప‌డుతాయి. స‌రిగ్గా ఇలాగే ఆలోచించింది కాబ‌ట్టే ఆ మ‌హిళ ఆ గ్రామంలోని మ‌హిళ‌ల కోసం వినూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ అందులో విజ‌యం సాధించింది. ఆమె చేసిన ప‌ని వ‌ల్ల ఇప్పుడు ఎంతో మంది మ‌హిళ‌లు నిరంత‌రాయంగా ఉపాధి పొందుతున్నారు. ఇంత‌కీ ఆ మ‌హిళ ఎవ‌రు ? ఆమె ఏం చేసింది ? అంటే…

త‌మిళ‌నాడులోని మ‌దురైకి చెందిన ఫ్యాష‌న్ డిజైన్ గ్రాడ్యుయేట్ ఎస్‌పీ పొన్మ‌ణి 2017లో అక్క‌డి కృష్ణ‌గిరి జిల్లాలోని పులియ‌నూర్ గ్రామంలో కుకూ ఫారెస్ట్ స్కూల్ ను సంద‌ర్శించింది. అక్క‌డ నుర్పు అనే సంస్థ ఆధ్వ‌ర్యంలో చేనేత ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించారు. అయితే అక్క‌డే ఆమెకు ఆలోచ‌న త‌ట్టింది. తాను కూడా ఓ సంస్థ‌ను చిన్న‌గా ప్రారంభిస్తే దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మ‌హిళ‌ల‌కు నిరంత‌రాయంగా ఉపాధి ల‌భిస్తుంది క‌దా.. అని ఆలోచించింది. వెంట‌నే పులియ‌నూర్ విలేజ్ టెయిల‌రింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది. దాని ద్వారా మ‌హిళ‌ల‌కు దుస్తుల‌ను కుట్ట‌డంలో ఆమె శిక్ష‌ణ ఇచ్చింది.

త‌రువాత పొన్మ‌ణి ప్యూర్ కాట‌న్‌తో మ‌హిళ‌ల లోదుస్తుల‌ను అందంగా కుట్టి షాపుల‌కు స‌ర‌ఫరా చేయ‌డం ప్రారంభించింది. తన వ‌ద్ద నేర్చుకునే మ‌హిళ‌లు కూడా ఆ దుస్తుల‌ను కుట్టేవారు. ఫ్యాబ్రిక్ కంపెనీల‌లో ల‌భించే కాట‌న్‌ను ఏ మాత్రం వేస్ట్ చేయ‌కుండా వాటితో లోదుస్తుల‌ను కుట్టేవారు. దీంతో వారి దుస్తుల‌కు మంచి గిరాకీ ఏర్ప‌డింది. ఈ క్రమంలో వారు ఇక వెనుదిరిగి చూడ‌లేదు. అప్ప‌టి నుంచి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు అలా ఉపాధి ల‌భిస్తోంది.

ఇక వారి టైలరింగ్ నెమ్మ‌దిగా పుంజుకునే స‌రికి పొన్మ‌ణి తువం పేరిట ఓ కంపెనీని స్థాపించింది. అందులో అనేక మంది మ‌హిళ‌లు ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టారు. ఎంతో మంది దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు. అయితే వారు ప్ర‌స్తుతం మ‌హిళ‌ల లోదుస్తుల‌ను మాత్ర‌మే కుడుతున్నారు, కానీ బొమ్మ‌లు, దిండ్లు త‌దిత‌ర ఉత్పత్తుల‌ను కూడా త‌యారు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అందులోనూ తాము విజ‌యం సాధిస్తామ‌ని వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version