దేవినేని ఉమా అల‌క‌కు కార‌ణ‌మిదే..!

-

టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా దూకుడు త‌గ్గించారా ?  నిత్యం మీడియాలో ఉంటూ.. ప్ర‌భుత్వంపై ఏదో ఒక విమ‌ర్శ చేసే ఆయ‌న కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారా ?  అంటే.. కృష్ణాజిల్లా నాయ‌కులు ఔన‌నే అంటున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి ? ఎందుకు ఆయ‌న మౌనంగా ఉన్నారు ? అనే ప్ర‌శ్న‌లు ఆస‌క్తిగా మారాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఏం జ‌రిగినా.. దేవినేని ఉమా మీడియా ముందుకు వ‌చ్చేస్తారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తారు. ఇక‌, మంత్రి కొడాలి నానికి, ఆయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినాభ‌గ్గుమ‌నే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

దేవినేని ఉమా కోసం మీడియా మిత్రులు కూడా కాచుకుని కూర్చొంటారు. కానీ, టీడీపీలో పార్ల‌మెంట‌రీ ప‌ద‌వులు, జిల్లాల ప‌ద‌వులు, రాష్ట్ర నాయ‌క‌త్వ ప‌దవులు, పొలిట్‌బ్యూరో వంటివి జ‌రిగిన త‌ర్వాత దేవినేని సైలెంట్ కావ‌డం.. ఆ త‌ర్వాత రాష్ట్రంలో అనేక ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డంతో.. ఏం జ‌రిగింద‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. దేవినేనిని దాదాపు కృష్ణా జిల్లాలో సొంత సామాజిక వ‌ర్గ‌మే ప‌క్క‌న పెట్టింది. ఆయ‌న దూకుడు పార్టీకి మేలు చేయ‌డం లేద‌ని.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు సైతం దారితీస్తోంద‌ని, ఆయ‌న వ్య‌వ‌హారంతో అటు చంద్ర‌బాబు కూడా టార్గెట్ అవుతున్నార‌ని నేత‌లు త‌ర‌చుగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో దేవినేనిని దూరంగా ఉంచుతున్నారు. ఇదిలావుంటే, టీడీపీలో అధినేత సైతం దేవినేనిని ప‌క్క‌న పెట్టారా ? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. పార్టీలో ఆయ‌న కోరుకున్న విధంగా ప‌ద‌వులు ల‌భించ‌క‌పోవ‌డం వెనుక దేవినేని అన‌వ‌స‌ర రాజ‌కీయ‌మే ఉందా ? అని అంటున్నారు. పార్టీకి ఉప‌యోగప‌డే నాయ‌కుడిగా చంద్ర‌బాబు ఆయ‌న‌కు చాలానే వాల్యూ ఇచ్చారు. అయితే, ఓట‌మి త‌ర్వాత‌.. దేవినేని పుంజుకున్న‌ది లేక‌పోగా.. అధికార పార్టీ నేత‌ల‌తో తీవ్ర వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు.

ఇక జిల్లాలో అనేక మంది ఉమా తీరు వ‌ల్లే ప‌దిహేనేళ్ల‌లో పార్టీ వీడిన ప‌రిస్థితి. ఉమాపై సొంత పార్టీ నేత‌లు ఎన్ని చెప్పినా కూడా బాబు, లోకేష్ ఉమాకే ప్ర‌యార్టీ ఇచ్చేవారు. పార్టీ మారిన వంశీ నుంచి, ఎంపీ కేశినేని నాని.. మాజీ మంత్రి మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌, ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, న‌గ‌రంలో తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేత‌లు ఉమాపై అనేకానేక ఫిర్యాదులు చేసినా శూన్యం. ఇక ఉమా విష‌యంలో ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కూడా ఆయ‌న్నే న‌మ్మిన చంద్ర‌బాబు ఇప్పుడు గెలిచిన నేత‌లు, మిగిలిన వాళ్ల ఒత్తిళ్ల‌తో ప్ర‌యార్టీ త‌గ్గించ‌క త‌ప్ప‌లేదంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ప‌ద‌వుల విష‌యంలోనూ చంద్ర‌బాబు శీత‌క‌న్నేశార‌నే కోణంలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌తోనే కావొచ్చు.. దేవినేని ఉమా సైలెంట్ అయి ఉంటార‌ని నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి ఆయ‌న వ్యూహం ఏంటో తెలియాలంటే ? వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version