భూమిపై సుమారుగా 6.6 కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు పెద్ద సంఖ్యలో జీవించి ఉంటాయనే విషయం మనకు ఇది వరకే తెలుసు. అయితే అంత భారీ సంఖ్యలో, భారీ శరీరాలతో ఉండే ఆ జీవులు అంత అకస్మాత్తుగా ఎలా అంతరించిపోయాయో ఇప్పటికీ సైంటిస్టులకు అంతుబట్టని మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఎట్టకేలకు సైంటిస్టులు అందుకు కారణాలను కనుగొన్నారు.
లండన్ ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ అలెస్సాండ్రో చియరెంజా తన పరిశోధక బృందంతో ఇటీవల ఓ అధ్యయనం చేపట్టారు. దాని ప్రకారం.. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు అంతరించిపోవడానికి గల కారణం భూమిని భారీ సైజులో ఉన్న గ్రహ శకలాలు ఢీకొనడమే అని తేల్చారు. గతంలో కొందరు సైంటిస్టులు డైనోసార్లు అంతరించిపోయేందుకు అగ్ని పర్వతాలు కారణమై ఉంటాయని భావించారని.. కానీ అగ్ని పర్వతాల వల్ల డైనోసార్లు చనిపోయేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. భారీ గ్రహ శకలాలు భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్లు చనిపోయి ఉంటాయని అన్నారు.
ఇక గ్రహశకలాలు భూమిని ఢీకొన్నాక వాటి నుంచి వెలువడిన ప్రమాదకరమైన రసాయనాల వల్ల డైనోసార్ల జాతి పూర్తిగా అంతరించిపోవడమే కాకుండా.. భూమిపై మొత్తం రసాయనాలు, వాయువులతో నిండిపోయి.. సూర్యరశ్మి పడకుండా చాలా సంవత్సరాల పాటు శీతాకాలం మాత్రమే ఉండేదని, అందువల్ల డైనోసార్లు జీవించేందుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఉంటాయని.. దీంతో అవి పూర్తిగా అంతరించిపోయాయని చెప్పారు. ఆ తరువాత అగ్ని పర్వతాలు క్రమంగా విస్ఫోటనం చెందడం వల్ల భూమిపై మళ్లీ సాధారణ వాతావరణ పరిస్థితి ఏర్పడి తిరిగి అన్ని జీవరాశులు మనుగడలోకి వచ్చి ఉంటాయని అన్నారు. అయితే ఈ విషయంపై మరిన్ని అధ్యయనాలు చేస్తున్నామని తెలిపారు.