ఐటీ ఉద్యోగం మానేశాడు.. వ్య‌వ‌సాయం చేస్తూ రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు..!

-

మ‌న దేశంలో ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం చేసే రైతులు ఎలాంటి క‌ష్టాల‌ను అనుభ‌విస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. పంట‌లు పండించాలంటే డ‌బ్బులు ఉండ‌వు. అప్పో సొప్పో చేసి విత్త‌నాలు, ఎరువులు కొని పంట‌ల‌ను వేయాలి. అవి ప్ర‌కృతి విప‌త్తుల‌కు త‌ట్టుకుని నిల‌బ‌డాలి. ఆ త‌రువాత వాటికి గిట్టుబాటు ధ‌ర రావాలి. అప్పుడే రైతుల‌కు లాభం వ‌స్తుంది. కానీ దేశంలో చాలా మంది రైతుల‌కు పెట్టుబ‌డే రావ‌డం లేదు. తీవ్ర‌మైన న‌ష్టాల్లోకి వారు కూరుకుపోతున్నారు. అయితే ఆ ఐటీ ఉద్యోగి మాత్రం వ్య‌వ‌సాయ‌మే బెస్ట్ అని అనుకున్నాడు. ఓ వైపు ల‌క్ష‌ల్లో జీతం వచ్చే ఉద్యోగాన్నే అత‌ను వ‌దులుకుని ఇండియాకు వ‌చ్చి ఆర్గానిక్ ఫామింగ్ మొద‌లు పెట్టాడు. ఏటా ఇప్పుడు ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నాడు. అంతే కాదు.. స్థానికంగా ఉన్న రైతుల‌కు ఆర్గానిక్ ఫామింగ్ మెళ‌కువ‌లు చెబుతూ వారు కూడా అభివృద్ది చెందేందుకు స‌హాయం చేస్తున్నాడు.

అత‌ని పేరు సురేష్ దేవాంగ్‌. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటీ ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు. ల‌క్ష‌ల్లో జీతం. అయినా అత‌నికి వ్య‌వ‌సాయం అంటే ఇష్టం ఉండ‌డంతో అత‌ను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి సొంత దేశానికి వ‌చ్చాడు. క‌ర్ణాట‌క‌లోని మైసూరుకు ద‌గ్గ‌ర్లో ఉన్న పుర అనే గ్రామంలో 2016లో 6 ఎక‌రాల స్థ‌లం కొన్నాడు. అందులో ఆర్గానిక్ ఫామింగ్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అయితే అక్క‌డ మొద‌ట్లో తీవ్ర‌మైన వ‌ర్షాభావ ప‌రిస్థితులు ఉండేవి. వ్య‌వ‌సాయం చేసేందుకు స‌రిగ్గా నీరు ఉండేది కాదు. కానీ అత‌ను కొంత స్థ‌లంలో చిన్న‌పాటి కుంట‌ను త‌వ్వి వ‌ర్షపు నీటిని నిల్వ చేశాడు. అలాగే భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచేందుకు ప‌లు ప్ర‌త్యేక ప‌ద్ధ‌తులు పాటించాడు. అనంత‌రం ఆర్గానిక్ ఫామింగ్ చేసేందుకు అవ‌స‌ర‌మైన మెళ‌కువ‌ల‌ను తెలుసుకున్నాడు. అప్ప‌టి నుంచి అత‌ను ఆ స్థ‌లంలో ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూ ఏటా ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నాడు.

సురేష్ త‌న స్థ‌లంలో కేవ‌లం ఒకే పంట మాత్ర‌మే కాదు, భిన్న‌మైన పంట‌ల‌ను ఒకేసారి వేస్తాడు. నిమ్మ‌, అర‌టి, కొబ్బ‌రి చెట్ల‌ను పెంచ‌డంతోపాటు వాటి మ‌ధ్య ఉండే ఖాళీ స్థ‌లంలో కూర‌గాయ‌ల పంట‌ల‌ను వేస్తాడు. దీంతో నీరు ఆదా అవ‌డ‌మే కాదు, ఎప్పుడూ ఏదో ఒక పంట‌ను తీసుకునేందుకు వీలుంటుంది. ఇలా అత‌ను ఏటా 15 క్వింటాళ్ల వ‌ర‌కు కూర‌గాయ‌లు, 40 ట‌న్నుల అర‌టి పండ్లు, కొబ్బ‌రి కాయ‌లు, నిమ్మ‌కాయ‌లు పండిస్తూ రూ. 6 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నాడు. ఇక త‌న పంట‌ల‌కు అత‌ను ఎలాంటి కృత్రిమ ఎరువులూ వాడ‌డు. కేవ‌లం సేంద్రీయ ఎరువుల‌నే ఉప‌యోగిస్తాడు. త‌న పంట‌ల ద్వారా ఉత్ప‌న్న‌మ‌య్యే కూర‌గాయ‌ల వ్య‌ర్థాల‌ను, ఆకుల‌ను ప‌శువులు, కోళ్ల‌కు తినిపించి వాటి ఎరువును పంట‌ల‌కు వేస్తాడు. దీంతో స‌హ‌జంగానే పంట‌లు ఏపుగా పెరుగుతాయి. దిగుబ‌డి ఎక్కువ‌గా వ‌స్తుంది. ఇలా అత‌ను ప‌లు మెళ‌కువ‌ల‌తో అత్యంత లాభ‌సాటిగా వ్య‌వసాయం చేస్తున్నాడు. అలాగే తోటి రైతుల‌కు ఆ వ్య‌వ‌సాయం ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. అవును మ‌రి.. అంద‌రూ వ్య‌వ‌సాయం దండ‌గ అని వేరే ప‌నులు చేసుకుంటే ఇక పంట‌లు ఎవ‌రు పండిస్తారు చెప్పండి. ఏది ఏమైనా.. సురేష్ చేస్తున్న పనిని మ‌న‌మంద‌రం అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version