ప్రతి ఏటా హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారీ ఎత్తున్న ఖైరతాబాద్ గణేషున్ని చూసేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక నిమజ్జనం రోజున వినాయకున్ని కోలాహలంగా ట్యాంక్ బండ్‌కు తరలించి నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో భారీ వినాయకున్ని ప్రతిష్టించబోవడం లేదు. ఈ విషయాన్ని ఆ గణేష్ ఉత్సవ కమిటీయే స్వయంగా వెల్లడించింది.
ఖైరతాబాద్ గణేషుడికి ఈ సారి కరోనా కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ సారి భారీ ఎత్తున్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం లేదని.. ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుంది. కేవలం 1 అడుగు మాత్రమే ఉన్న గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని నిర్వాహకులు తెలిపారు. కరోనా నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ నెల 18వ తేదీన జరగాల్సిన కర్ర పూజను కూడా రద్దు చేశామని వారు తెలిపారు.
కాగా గత కొద్ది సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం ఎత్తును తగ్గిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గతేడాది 61 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే కరోనా కారణంగా ఈ సారి కేవలం 1 అడుగు ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టి.. చాలా తక్కువ మందితో పూజలు చేయనున్నారు.