రోడ్డుపైన ఏదో పనిమీద వెళ్తున్నా.. అక్కడ చాలా మంది గుంపుగా చేరి ఈలలు, చప్పట్లు కొడుతున్నారు.. ఏంటా అని కుతూహలంతో వెళ్ళా…. ఉన్నట్లుండి అక్కడ జరుగుతున్న సన్నివేశం చూడగానే ఒళ్ళంతా జలవరించింది.. టక్కున నా పాప గుర్తుకొచ్చింది.. తండ్రి పంటి మీద కర్ర పెట్టుకుని ఆ కర్ర చివర మాటలు కూడా సరిగా రాని చిన్నారిని తుండుతో కట్టి ఒక విన్యాసం చేస్తున్నాడు.
నా చిట్టి తల్లిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే నేను… ఆ పాపలో కూడా నా పాపను చూశా అంతే.. ఆవేశం ఆగలేదు. ఆ పాప తండ్రిని, అక్కడ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లని చెడా మడా తిట్టాలనుకున్నా… కానీ ఆగిపోయా.. ఆ తండ్రి పంటికి ఆ పిల్ల జీవితానికి ఉన్న దూరం ఆకలి.. ఏంటీ ఈ విపరీతం..? చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఇప్పుడు మాత్రం నా మనసంతా బాధగా అనిపించింది.
సమాజంలో ఉన్న కొన్ని ఆలోచనలు… సమాజంలో ఉన్నామని చెప్పుకునే మనం ఆలోచించే ధోరణి… ఆకలి కోసం ఇంటి ముందుకి వచ్చిన వాడిని పైకెళ్ళి రా అని చెప్పి కూడా నవ్వుకునే మనుషుల్లారా… విజ్ఞత కోల్పోయి మాట్లాడే పరిణితి ఉన్న విద్యావంతుల్లారా… మంచి పనికి చిల్లి గవ్వ ఇవ్వలేని పెద్ద మనుషుల్లారా…..
స్వర్గాలను అందుకునాలని వడిగా గుడి మెట్లెక్కేవు..
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు..
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే గుండె బండగా మార్చేదా సాంప్రదాయమంటే..
మన కడుపుకి తినే దాని కోసం ఆహారాన్ని ఇంటికే తెప్పించుకుని తినే సామర్ధ్యాన్ని పెంచుకున్నామ్… కాని కంటి ముందు తిండి కనపడినా తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను చూసి మనం చులకనగా మాట్లాడుతున్నామ్… నీ కడుపుకి హోటల్ కి దూరం నీ బద్ధకం అయితే… ఆ తండ్రి పంటికి ఆ పిల్ల జీవితానికి ఉన్న దూరం ఆకలి. రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు కనపడితే… వేసే రూపాయికి వాళ్ళను వంద మాటలు మాట్లాడుతూ ఉంటుంది సమాజం.
కర్ర జారినా తుండు ఊడినా పన్ను కదిలినా ప్రపంచం అంటే తెలియని ఆ చిన్నారి జీవితం గాల్లో కలిసిపోతుంది. మనం ఈ రోజు ఎన్నో రకాలుగా ఖర్చులు పెడుతూనే ఉన్నాం దాంట్లో దుబారానే ఎక్కవన్నది సత్యం.. అలాంటి మనం చిన్న సాయం చెయ్యాల్సివచ్చినప్పుడు మాత్రం లెక్కలు పెడతాం.. వంద మంది తలా 10 రూపాయలు వాళ్లకు ఇస్తే వెయ్యి వస్తాయి.. ఆ సంపాదన ఇంకా ఎక్కువే ఉంటుంది… నెలకు 40 వేలు సంపాదిస్తారు అంటూ జారుకనే ప్రయత్నం చేస్తామ్.. ఒక్క మాటతో తీసేస్తామ్… ఆయనెవరో చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావు.. ఎంతో కష్టపడి సంపాదించి ఉంటాం.. కష్టం విలువ మనకు తెలుసు.. కానీ అదే కష్టం ఎదుటి వాడు పడుతుంటే మాత్రం చులకన చేస్తాం.
నిజంగానే మనం ఇలాంటి విన్యాసాలు చూస్తూ అలవాటుపడిపోయాం.. చిన్నప్పుడు బడులలో ఈ సన్నివేశాలు కోకొల్లలు… ఆ రోజు వాటిని చూసి వినోదం పొందాం… పసి హృదయానికి అది వినోదమే.. కానీ ఈ రోజు చేతిలో ఎంతో కొంత ఉండే ఉంటుంది. కాని వాళ్ళను చూసి పని చేసుకోలేక రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేస్తూ అవమానిస్తున్నామ్… అదే కుప్పిగంతులు, కోతి వేశాలు సినిమాల్లో వేస్తే చూడటానికి వందల రూపాయలు వెద జల్లుతావే..
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది..
గర్వపడే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచినది..
రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా.. తెప్ప తగలబెట్టేస్తావా.. ఏరు దాటగానే..
మనకు ఆకలి ఎగతాళి అయితే వాళ్లకు ఆ కర్ర చివరన అమాయకంగా వేలాడుతున్న ఆ పసి గుండె. తల్లి తండ్రుల కడుపునింపడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఆ చిన్నారే ఆ తండ్రికి ప్రాణం…