రాజకీయాల్లో దూకుడుగానే కాదు.. సైలెంట్‌గా ఉండే నాయకులు చాలా మందే ఉన్నారు. అసలా మాటకొస్తే.. ఫైర్‌బ్రాండ్ల కన్నా కూడా సైలెంట్ నాయకులు ఎక్కువ మంది. ఇలా సైలెంట్‌గా ఉంటూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసుకుంటూ.. కొన్ని దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న నాయకులు ఉన్నారు. ఇలాంటి వారిలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గం కొవ్వూరు నుంచి విజయం సాధించిన తానేటి వనిత ఒకరు. 2014లో కేఎస్ జవహర్‌పై పోటీ చేసిన వనితకు గత ఏడాది ఎన్నికల్లో అనూహ్య విజయం లభించింది. వివాదాలకు అత్యంత దూరంగా.. ఫీల్‌గుడ్ పొలిటిషియన్‌గా వ్యవహరించే నాయకురాలిగా వనిత పేరు తెచ్చుకున్నారు.
జగన్ అంటే ప్రాణం పెట్టే వనితకు జగన్ తన తొలి కేబినెట్‌లోనే స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించారు. వివాద రహితంగా తన పనితాను చేసుకుని పోతున్నారు వనిత. ఎమ్మెల్యేగా, మంత్రిగా వనిత ఏడాది పూర్తి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో ఏనాడూ ఆమె మీడియా ముందుకు వచ్చింది కానీ, భారీ ఎత్తున ప్రకటనలు చేసింది కానీ లేదు. ఓ ఉన్నతస్థాయి ఉద్యోగస్థురాలు ఎలా అయితే.. తన పని తాను చేసుకుపోతుందో.. అచ్చు అలానే వనిత కొనసాగుతున్నారు. అయితే ఈ నినాదం అన్ని వేళలా పనిచేస్తుందా ? అంటే.. కాదని అంటున్నారు కొవ్వూరు ప్రజలు.
టీడీపీకి కంచుకోట వంటి కొవ్వూరులో ప్రజలు వైసీపీని తొలిసారి గెలిపించారు. మరి ఇది చిరస్థాయిగా నిలిచిపోవాలంటే, మళ్లీ మళ్లీ వైసీపీ విజయం సాధించాలంటే.. ఇక్కడ బలమైన పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. కానీ.. వనిత మాత్రం సైలెంట్‌గాఉంటున్నారు. పోనీ.. ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నారా ? అంటే.. లేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇసుక సమస్య సహా ఇళ్ల పట్టాల సమస్య కూడా ఇక్కడ ఉంది. అదే సమయంలో రేషన్ కార్డుల విషయం పైనా ఇక్కడ గతంలో వనిత ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు.
ప్రభుత్వం ఇస్తానని చెప్పిన పేదలకు ఇళ్ల విషయంలోనూ తమకు న్యాయం జరగడం లేదని కొందరు అంటున్నారు. పింఛన్లు రద్దు చేశారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయా సమస్యలను పరిష్కరించడంలో దూకుడు ప్రదర్శించకపోయినా.. కనీసం తనదైన పంథాలో అయినా వనిత ముందుకు సాగాలనే వాదన ఉంది. కానీ ఆమె మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. ఇలాంటి పరిస్తితి మున్ముందు ప్రమాదకరమని అంటున్నారు పరిశీలకులు. మరి వనిత ఇప్పటికైనా మారతారా ? లేదా ? అనేది చూడాలి.