కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఇప్పుడిప్పుడే ఆంక్షలను క్రమంగా సడలిస్తుండడంతో అన్ని కార్యకలాపాలు పునః ప్రారంభమవుతున్నాయి. ఇక ఇప్పటికే కేంద్రం ఖాళీ స్టేడియాలతో క్రీడలు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. అయినప్పటికీ అందుకు ఇష్టం లేక బీసీసీఐ ఐపీఎల్‌పై నిర్ణయం తీసుకోలేదు. అయితే కరోనా ప్రభావం తగ్గితే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐపీఎల్ 2020ని నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఫ్రాంచైజీలతో కలిసి బీసీసీఐ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
కాగా ఐపీఎల్ 2020 నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌లో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేమని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎప్పటికి మెరుగు పడతాయో, స్టేడియాలలో ప్రేక్షకులతో ఎప్పుడు మ్యాచ్‌లను మళ్లీ నిర్వహిస్తామో తెలియదన్నారు. కనుక ఐపీఎల్ 2020 నిర్వహణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, కాకపోతే ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మాట్లాడడం పూర్తయిందని, ఐపీఎల్ 2020 షెడ్యూల్ విడుదల మాత్రమే పెండింగ్‌లో ఉందని సమాచారం. అక్టోబర్ నెలలో ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది.
ఇక మరోవైపు ఐపీఎల్‌ను నిర్వహించుకునేందుకు శ్రీలంక, యూఏఈ వంటి దేశాలు బీసీసీఐని ఆహ్వానించాయి. కానీ భారత్‌లోనే ఈ టోర్నీని నిర్వహించాలని గంగూలీ పట్టుదలగా ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో కరోనా ప్రభావం తగ్గితే.. ఐపీఎల్ షెడ్యూల్ విడుదలపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా అక్టోబర్ నెలలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌పై జూన్ 10వ తేదీన ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో ఆ విషయంపై కూడా క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది.