“బడి” ఒకప్పుడు ఈ పిలుపు ఎంతో అందంగా ఉండేది కదా…? దాదాపు రెండు నెలలు సెలవలు ఎంజాయ్ చేసిన పిల్లలు బ్యాగులు మోసుకుంటూ క్యారేజీలు మోసుకుంటూ బడికి బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్ళే వారు. ఎన్నో అనుభూతులను, బంధువులను, స్నేహితులను, తమతో రెండు నెలలు సావాసం చేసిన ఆట వస్తువులను వదిలి వెళ్ళే పిల్లలు ఎంతో భారంగా బడికి అమాయకంగా అడుగులు వేస్తూ ఉంటారు. బడికి వెళ్ళే ముందు సరస్వతి పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మలు, నాన్నలు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళను పంపడం ఇష్టం లేకపోయినా భవిష్యత్తు దృష్ట్యా తప్పదు కాబట్టి పంపిస్తూ ఉంటారు.
ఇది అంతా ఒకప్పుడు… ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అంటున్నారు. తల్లి తండ్రుల… వ్యాపారాలు, ఉద్యోగాలు ఇతరత్రా పనులతో పిల్లలను తల్లి తండ్రులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం బడికి మొదటి రోజులు పిల్లలు వెళ్తుంటే… తొలి రోజు కాబట్టి పనులు అన్నీ మానుకుని తండ్రో లేక తల్లో వెళ్లి వాళ్ళను దింపి పుస్తకాలు అన్నీ ఇచ్చి వారితోటి విద్యార్ధులను పరిచయం చేసుకుని వస్తూ ఉంటారు. ఇక మధ్యాహ్నం లంచ్ బాక్స్ తింటారో లేదో అని వెళ్లి తినిపించి వస్తూ ఉంటారు తల్లి తండ్రులు.
కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి… పోయినేడాది వెళ్ళిన బడే కదా వాడే వెళ్తాడులే బస్సు వస్తుంది కదా అని పట్టించుకోవడం మానేశారు. వారి ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ… బడికి వెళ్ళే ముందు ఒక ముద్దు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. కాని పిల్లలు మాత్రం రెండు నెలలు స్వేచ్చగా ఆడుకుని అలా వెళ్లి ఒక కూర్చునే సరికి వారిలో ఏదో తెలియని బాధ… తొలి రోజు బడి జ్ఞాపకాలు కోల్పోతున్నారని అంటున్నారు. ఇంటికి వెళ్ళే టైంకి అమ్మో లేక నాన్నో వచ్చి తీసుకువెళ్ళట్లేదు… ఆయాలు బస్సు ఎక్కి పంపిస్తే ఆ బాగ్ మోసుకుని బస్ ఎక్కుతున్నారు.
ఈ తరాలకు తల్లి తండ్రుల వ్యాపారాలు, ఉద్యోగాలు శాపంగా మారిపోయాయి. మొదటి రోజు నుంచి వారిని చదువులో రుద్దడం, ప్రతీ దానికి సాధించడం, పిల్లల మీద ఉద్యోగాల చికాకులు వ్యాపారాల చికాకులు చూపించడం వంటివి చేస్తున్నారు. బడి అనేది ఇప్పుడు ఒక అవసరంగా మారింది గాని జ్ఞాపకంగా మాత్రం లేదు. కానీ పల్లెటూర్లలో మాత్రం ఇలా లేదు. తల్లి తండ్రులు పిల్లలను బడికి తీసుకువెళ్ళి వారితో కొంత సమయం ఉండి వస్తున్నారు. కార్పోరేట్ కళాశాలల్లో చదివే పిల్లలను మాత్రం పైన పేర్కొన్న శాపాలు వెంటాడుతున్నాయి. బడి అనే దేవాలయంలో గురువుతో పాటు ఇంట్లో ఉండే అమ్మా నాన్న కూడా తోడైతేనే చదువు అందంగా ఉంటుంది.