ఏది ఏమైనా తెలంగాణ బిజెపి లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో ఉందా లేదా అన్నట్లు గా ఉంటూ, కేవలం సిటీ పరిధిలో మాత్రమే తన ప్రభావం చూపిస్తూ వచ్చిన బీజేపీ గత కొంతకాలంగా బాగా బలం పుంజుకుంది. ప్రస్తుతం దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికార పార్టీ టిఆర్ఎస్ హవాను తట్టుకుని మరీ విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఓటమి చెందిన దగ్గర నుంచి రాజకీయ పరిణామాలు శర వేగంగా మార్పు చేర్పులు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ మార్పులతో బీజేపీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే, ఓటమి బాధలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, బిజెపి కూడా ఇక్కడ పార్టీ జెండా ఎగురవేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ వైఖరిని బట్టి చూస్తుంటే , డిసెంబర్ మొదటి వారంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే విధంగా కనిపిస్తున్నాయి. దీంతో బిజెపి ఇక్కడ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దుబ్బాక లో మాదిరిగా సమిష్టిగా బిజెపికి ఇక్కడ విజయాన్ని తీసుకువచ్చే విషయంపై ఆ పార్టీ నాయకులు పూర్తిగా దృష్టి సారించారు ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మేరకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికల ప్రచార అస్త్రాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశం, వరద సహాయం పైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని, దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే బిజెపికి మంచి రోజులు వస్తాయని, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
గ్రేటర్ లో సమిష్టిగా టిఆర్ఎస్ పై పోరాడాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి అధిష్టానం పెద్దలు కూడా తగిన విధంగా సహాయ సహకారాలు అందిస్తుండడం బాగా కలిసి వస్తోంది. ఇది ఇలా ఉంటే గ్రేటర్ లో బిజెపి జెండా ఎగురవేసేందుకు అనుగుణంగా, ఆ పార్టీ పెద్దలు ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు కొత్తగా గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జిహెచ్ఎంసి ఎన్నికల నిమిత్తం పూర్తిగా ఉపయోగించుకోవాలని బిజెపి కేంద్ర పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి కి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ వంటి ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాలతో పాటు అంబర్ పేట , హిమాయత్ నగర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోనూ పట్టు ఉండడం, ఈ పార్లమెంట్ పరిధిలోనే ఇవి ఉండటంతో ఇక్కడ ఆయన పూర్తిగా దృష్టి సారించబోతున్నారు. అలాగే బండి సంజయ్ విషయానికి వస్తే, ఎక్కువగా ఆయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం తో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను హైలెట్ చేసుకుంటూ, గ్రేటర్ మొత్తం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ , ఓటర్ జాబితా దగ్గర నుంచి అన్ని వ్యవహారాలను చూసుకునే విధంగా ప్లాన్ చేశారు.
ఇక అరవింద్ విషయానికి వస్తే, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు, కేటీఆర్ , హరీష్ ఇలా ఎవరిపైన ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలు చేయడం లో ఆయన దూకుడుగా వ్యవహరిస్తారని అధిష్టానం నమ్ముతోంది. అందుకే ఆయన సేవలను జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చూస్తోంది. కొత్తగా ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు గ్రేటర్ బాధ్యతను అప్పగిస్తే ఆయన బాధ్యత వహిస్తారని, విద్యావంతుడు కావడమే కాకుండా కెసిఆర్, కేటీఆర్, హరీష్ కు బాగా తెలిసిన వ్యక్తి కావడం, దుబ్బాక ఎన్నికల్లో ఆయన గెలుపొందడంతో వచ్చిన క్రేజ్, ఇలా అన్నిటినీ వాడుకోవాలని బీజేపీ అధిష్టానం చూస్తోందని , ఈ నలుగురుతో ఏదో రకంగా గ్రేటర్ లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కేంద్ర పెద్ద ఆశలు పెట్టుకున్నారు.