ప్రేమజంటను ఊళ్లోకి రానీయకుండా బహిష్కరించారు..!

-

ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ. ప్రేమిస్తే చంపేస్తారా.. ప్రేమించడం తప్పా.. ఏంది ఈ వివక్ష అంటూ సోషల్ మీడియాలో రోజూ ఈ రచ్చ చూస్తూనే ఉన్నాం. సరే.. ఇప్పుడు ప్రణయ్-అమృత, సందీప్-మాధవి లవ్ స్టోరీ గురించి మాట్లాడటం లేదు కానీ.. వీళ్ల గురించి జనాలు చర్చిస్తున్న క్రమంలోనే మరో స్టోరీ వెలుగులోకి వచ్చింది. అదే ఈ ప్రశాంత్-సంధ్య లవ్ స్టోరీ.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను ఊళ్లోకి రాకుండా ఆ ఊరు గ్రామస్థులు అడ్డుకున్నారు. వాళ్లేం పాపం చేయలేదు. కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. అందుకే వాళ్లను ఊరు నుంచి వెలివేశారు. జనగామ జిల్లాలోని గుండాల మండలం మరిపడిగ గ్రామంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నది.

మరిపడిగకు చెందిన 23 ఏళ్ల ప్రశాంత్ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో జనగామకు చెందిన 20 ఏళ్ల సంధ్యతో ప్రశాంత్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లింది. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు. ఎలాగూ వాళ్ల పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోరని పెళ్లి చేసుకున్నారు. పోలీసుల వద్దకు వెళ్లారు. దీంతో పోలీసులు వాళ్లకు, వాళ్ల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ప్రశాంత్ స్వగ్రామం మరిపడిగకు వెళ్లారు.

అయితే.. ఊళ్లోకి అడుగుపెట్టగానే ఆ ప్రేమజంటకు చేదు అనుభవం ఎదురైంది. వాళ్లను గ్రామస్తులు ఊళ్లోకి రానీయలేదు. ఊరి పెద్దలంతా కలిసి ఈ నిర్ణయం తీసుకోగా.. వాళ్ల మాటకు గ్రామస్తులు కూడా కట్టుబడి ఉన్నారు. ప్రశాంత్ క్యారెక్టర్ సరిగా ఉండదని.. ఇదివరకు చాలా అమ్మాయిలను మోసం చేశాడని.. ఇక ముందు కూడా అమ్మాయిలను మోసం చేస్తాడని అతడి వల్ల ఊరికి చెడ్డ పేరు రాకూడదని ఊళ్లోకి రానివ్వడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ.. వాళ్లు ఊళ్లోకి రానీయకపోవడానికి అసలు కారణం కులాంతర వివాహం చేసుకోవడమే.. వారికి అది నచ్చకనే నా క్యారెక్టర్‌ను బ్యాడ్ చేస్తున్నారంటూ ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version