ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయటంతో వైసీపీలో ఆశావహులు లాబీయింగ్ ముమ్మరం చేశారు. గతంలో పార్టీ అధినేత జగన్ నుంచి హామీ పొందినవారు కొందరైతే… సామాజిక వర్గాల సమీకరణాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నవారు మరి కొందరు..ఇలా ఎన్నిక జరుగునున్న ఆరు సీట్ల కోసం ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను గత ఏడాది ఆగిన చోటునుంచి కొనసాగించటానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఖాళీగా ఉన్న ఆరు శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 15న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ ను నిర్వహించనున్నారు.
ఖాళీ అయిన ఆరు స్థానాల్లో నాలుగు ఎమ్మెల్సీల పదవీకాలం శాసన సభ్యుల కోటా నుంచి పూరైంది. వీటిలో తిప్పేస్వామి, సుధారాణి, వెంకన్న చౌదరిలు టీడీపీ సభ్యులు. ఇప్పుడు ఈ మూడు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ పదవీ కాలం కూడా ఈ నెల 29తో ముగియనుంది. ఇక్బాల్‌కు అధినేత రెండో సారి అవకాశం ఇస్తారా లేదా అన్న చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ కోటాలో అవకాశం లభిస్తుందని ఇక్బాల్ వర్గం ఆశలు పెట్టుకుంది.
ఇక మిగిలిన మరో రెండు స్థానాల్లో ఒకటి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ ఎంపీగా ఎంపిక కావటంతో ఖాళీ అయ్యింది. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. సీఎం జగన్ ఇప్పటికే చల్లా కుటుంబానికి ఎమ్మెల్సీ హామి ఇచ్చారు. దీనితో చల్లా రామకృష్ణారెడ్డి మృతితో అయిన ఖాళీ ఆయన కుమారుడితోనే భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందటంతో ఆయన కుమారుడికి ఎంపీ టికెట్‌కు బదులు మండలిలో చోటు ఇస్తామని భరోసా ఇచ్చారు జగన్. ఎస్సీ వర్గానికి ఒక స్థానం కేటాయించినట్లు అవుతుంది.
ఇక మిగిలిన నాలుగింటిలో ఆశావహులు పోటీ పడాల్సి ఉంది. ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయినందుకు మర్రి రాజశేఖర్‌కు జగన్ ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. అదే జిల్లాకు చెందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్‌ను ఆఖరి నిమిషంలో లేళ్ల అప్పిరెడ్డికి బదులు ఏసురత్నానికి కేటాయించారు. ప్రత్యామ్నాయంగా మండలిలో సభ్యత్వం కల్పిస్తామన్న హామి లేళ్ల అప్పిరెడ్డికి ఉంది.
గోదావరి జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గం నుంచి తోట త్రిమూర్తులు పేరు కూడా వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు తన కుమారుడు దాడి రత్నాకర్‌కు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. తండ్రి, తనయుడిల్లో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. చీరాల నుంచి పోటి చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక వర్గాలు, ప్రాంతాలు అన్నింటిని పరిగణలోకి తీసుకుని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అయితే నేతల్లో మాత్రం పోటీ తీవ్రంగా నెలకొని ఉంది.