హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ ఉండింది. మధ్యాహ్నం సమయం కాగానే ఒక్కసారిగా ఈదురు గాలులు విపరీతంగా వీచాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ ఏ చెట్టు కూలుతుందేమోననే భయం నెలకొంది. ఆ గాలిలోనే వర్షం కురిసింది. దీంతో నగరంలోని మల్కాజ్ గిరి, ఉప్పల్, కుషాయిగూడ, మేడ్చల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాచారం, మల్లాపూర్, తార్నాక, బోడుప్పల్, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
వర్షం కారణంగా చాలా చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో రాబోయే 2 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.