Breaking : మంకీపాక్స్‌ కట్టడికి డబ్ల్యూహెచ్‌ కీలక ఆదేశాలు..

-

యావత్తు ప్రపంపచాన్ని భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న తరుణంలో.. మంకీ పాక్స్‌ రూపంలో మరో వైరస్‌ ప్రజలపై విరుచుకుపడుతోంది. అయితే.. ఈ వైరస్‌ రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. వివిధ దేశాల్లో మంకీపాక్స్ కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 27 దేశాల్లో 780 కేసులు బయటపడిన నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. డబ్ల్యూహెచ్‌వో అధికారిణి మరియా వాన్ కెర్‌ఖోవ్ ఈ విషయమై మాట్లాడుతూ.. అసలు మంకీపాక్స్ అంటే ఏంటి? నివారణ చర్యలు తదితర అంశాలపై ముందుగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా అయిదు నివారణ చర్యలను ప్రతిపాదించారు.

వైరస్‌, టెస్టింగ్‌పై విస్తృతస్థాయిలో అవగాహన

అసలు మంకీపాక్స్‌ అంటే ఏంటి? ఎలా వ్యాపిస్తుంది? తదితర అంశాలపై వైద్యారోగ్య సిబ్బంది, పౌరుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ముఖ్యంగా మంకీపాక్స్‌ గురించి అవగాహన లేని దేశాల్లో.. స్థానిక వైద్య వ్యవస్థలు దీన్ని సకాలంలో గుర్తించేలా, సరైన చికిత్స అందించేలా చర్యలు అవసరం.

మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తిని నిరోధించడం

నాన్‌ ఎండెమిక్‌ దేశాల్లో దీన్ని చేయొచ్చు. ప్రస్తుతం మనం.. వైద్య సదుపాయాల సాయంతో వైరస్‌ను ముందుగా గుర్తించగలిగే స్థితిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో అనుమానితులతోపాటు వారిని కలిసినవారిని ఐసొలేషన్‌ చేయడం వంటి చర్యలు కీలకం. ఇందుకోసం స్థానిక ప్రజలతో మాట్లాడటం, వారిలో అవగాహన కల్పించడం ముఖ్యం.

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు రక్షణ
అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేవారు, పరీక్షలు చేసేవారు, సేవలు అందించేవారు.. ముందుగా ఈ వైరస్‌పై తగిన సమాచారం కలిగి ఉండాలి. తగు రక్షణాత్మక చర్యలు తీసుకోవాలి.

వైరస్‌ నివారణ చర్యల అమలు
ఈ వైరల్‌ వ్యాధి చికిత్స కోసం అవసరమైన అన్ని పద్ధతులను అవలంబించాలి. ఇందుకోసం కొన్ని యాంటీవైరల్స్‌, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటి వినియోగం విషయంలో జాగ్రత్తలు అవసరం.

మంకీపాక్స్‌పై పరిశోధనలు ముమ్మరం చేయడం..
వైరస్‌ గురించి పూర్తి సమాచారాన్ని విశ్లేషించాలి. ఈ క్రమంలోనే.. అంటువ్యాధులకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణులు, పరిశోధన సంస్థలతో త్వరలోనే ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version