కనుబొమ్మల సోయగం.. అందమైన కనుబొమ్మల కోసం చిట్కాలు

-

ముఖం అందంగా కనిపించడానికి కనుబొమ్మల ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. కనుబొమ్మలు అందరికీ ఉంటాయి. కానీ కొంతమందికి దట్టంగా కనిపిస్తే మరికొందరికి పలుచగా కనిపిస్తాయి. దట్టంగా ఉండే కనుబొమ్మలను ఏ ఆకృతిలో అయినా షేప్ చేసుకోవచ్చు. పలుచగా ఉన్న కనుబొమ్మలతో అంత సులువు కాదు. వీటికి ఐబ్రో పెన్సిల్ వాడినా ఒరిజినల్ కనుబొమ్మలుంటే ఆలుక్కే వేరు కదా. పలుచని కనుబొమ్మల నుంచి దట్టమైన కనుబొమ్మలుగా మార్చడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే సరి. అనుకున్న విధంగా షేప్ చేసుకోవచ్చు. మరి అవేంటో చూద్దాం.

– దట్టమైన అందమైన కనుబొమ్మల కోసం ఆముదం, ఆలివ్ ఆయిల్ చక్కగా పనిచేస్తాయి. కనుబొమ్మలకు రోజూ ఆముదం రాస్తే మంచిది. ఆలివ్ ఆయిల్ రాసినా కనుబొమ్మలు బాగా ఒత్తుగా పెరుగుతాయి. కనుబొమ్మలు తేమగా ఉండేందుకు రాత్రి సమయంలో మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు.

– కనుబొమ్మలు ఒత్తుగా మారేందుకు ఉల్లిరసం ఉపయోగపడుతుంది. అందులో ఉండే సల్ఫర్ రక్తసరఫరా బాగా అయ్యేందుకు పనిచేస్తుంది. ఉల్లిరసాన్ని కనుబొమ్మలకు రాసి 40 నిమిషాల తర్వాత కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

– కలబందను సగానికి కోసి, మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని కనుబొమ్మలకు రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ పద్ధతిని రోజుకు రెండుసార్లు చేయాలి. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే కొన్నిరోజులకే దట్టమైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు.

-ముఖాకృతికి తగినట్లుగా ఐబ్రోస్ ఉన్నప్పడే అందంగా కనిపిస్తారు. ఒకరు ఒకలా ఉంటే మరొకరు ఇంకోలా ఉంటారు. వీరి ముఖానికి ఎలాంటి ఐబ్రోస్ నప్పుతాయో ఆ షేప్ చేయించుకోవాలి.

– కోలముఖం కలిగిన వారికి ఫుల్ ఐబ్రోస్ బాగుంటాయి. గుండ్రాటి ముఖం ఉన్నవారికి యాంగిల్డ్ ఐబ్రోస్ బాగుంటాయి. స్కేర్ ఫేస్ చిన్నగా ఉన్నవారికి వంపు తిరిగినట్లుగా ఉన్న కనుబొమ్మలు బాగుంటాయి.

– జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా నూనె రాస్తూ ఉంటాం. అదేవిధంగా కనుబొమ్మల వెంట్రుకలకు కూడా నూనె రాసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల కొబ్బరినూనెను ఐబ్రోస్‌పై రాసి కొంచెంసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మల వెంట్రుకలకు పోషణ అంది పెరుగుదల స్టార్ట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news