లాక్ డౌన్ సడలింపుల అనంతరం తెరుచుకున్న టీటీడీ ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తుల సంఖ్యను ఆలయ అధికారులు పెంచుతున్నారు. ఆన్లైన్, ఆఫ్ లైన్లో టిక్కెట్లను టిటిడి అందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులకు త్వరితగతిన దర్సన భాగ్యం లభిస్తోంది. కాగా, నిన్న ఒక్కరోజే స్వామివారిని 12,273 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 3,834 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
అలాగే హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో రద్దీ సమయంలోనే ప్రతిరోజు కోటి నుంచి కోటిన్నర వరకు వచ్చేది. ఇక శని, ఆదివారాలైతే మూడు కోట్ల వరకు హుండీ ఆదాయం వచ్చేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య తక్కువగానే ఉండటంతో హుండీ ఆదాయం అర కోటి వరకు వస్తోంది. ఈ క్రమంలో నిన్న ఒక్క రోజే రూ.67 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా ఆలయంలో శ్రీవారికి ఆర్జిత సేవలను రద్దు చేశారు.