కరోనా లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా 70 రోజుల నుంచి మూతపడి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయం ఎట్టకేలకు తెరుచుకోనుంది. జూన్ 11వ తేదీ నుంచి ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం టీటీడీ పాలకమండలి సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 8 నుంచి దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో టీటీడీ శ్రీవారి ఆలయాన్ని ఓపెన్ చేసేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతి కోరింది. తాజాగా ఆ అనుమతులు లభించడంతో జూన్ 11 నుంచి శ్రీవారి ఆలయాన్ని తెరుస్తున్నట్లు ప్రకటించారు.
కాగా జూన్ 8వ తేదీ నుంచి టీటీడీ ఉద్యోగులు, సిబ్బందితో ఆలయంలో దర్శనాలకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి అనుమతి లేదన్నారు. గదుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతినిస్తామన్నారు. భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులను ఎల్లప్పుడూ ధరించాలని అన్నారు.
ఇక 8,9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు, 10వ తేదీన స్థానికులకు దర్శన అవకాశం కల్పిస్తామని తెలిపారు. 11వ తేదీ నుంచి భక్తులందరికీ దర్శనానికి అనుమతినిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి నిత్యం 3వేల మందికి, నేరుగా వచ్చే వారికి నిత్యం 3వేల మందికి దర్శనానికి అనుమతినిస్తామన్నారు. కంటెయిన్మెంట్ జోన్లలో ఉండేవారు తిరుమలకు రాకూడదని కోరారు. అలాగే 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
కల్యాణకట్టలో పనిచేసే వారు పీపీఈ కిట్లను ధరించాలని తెలిపారు. గదులను పూర్తిగా శానిటైజ్ చేశాకే ఇతర భక్తులకు వాటిలో ఉండేందుకు అనుమతిస్తామన్నారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి లేదన్నారు. దర్శనాల అనంతరం శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ ఉండదన్నారు. ఘాట్ రోడ్డును ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే తెరిచి ఉంచుతామన్నారు. ప్రతి రోజూ ర్యాండమ్‌గా భక్తుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దేవాలయాల్లో అన్ని చోట్లా శానిటైజర్లను ఉపయోగిస్తామన్నారు.
కొండపై మిగిలిన ఆలయాల్లో దర్శనం ఉండదన్నారు. అలిపిరి, కొండపై కరోనా నిర్దారణ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కల్యాణ కట్ట దగ్గర కోవిడ్ 19 నిబంధనలను అమలు చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కొండపైకి వచ్చే వాహనాలను పూర్తిగా శానిటైజ్ చేస్తామన్నారు. ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు వీఐపీ దర్శనాలకు అనుమతి ఉంటుందన్నారు. కల్యాణకట్ట, హుండీ, ప్రసాదాల అమ్మకం కౌంటర్ల వద్ద భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులను ధరించాల్సి ఉంటుందన్నారు.