పరిహారం ఇప్పించాలని.. ఎమ్మార్వో కాళ్లు మొక్కిన రైతు

-

కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్ శివారులో NH-563 విస్తరణలో భాగంగా భూమిని కోల్పోయిన ఓ రైతు నిర్మాణ పనులకు అడ్డుపడ్డాడు. తనకు రావాల్సిన పరిహారం పూర్తిగా ఇప్పించాలని అధికారులను వేడుకున్నాడు. మీ కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి రైతు ప్రాధేయపడ్డాడు.

వివరాల్లోకివెళితే.. ఇప్పలపల్లి గ్రామ రైతు వెంగళ శ్రీనివాస్‌కు సర్వే నంబర్ 166లో భూమి ఉన్నది. నేషనల్ హైవే విస్తరణలో భాగంగా 23 గుంటల భూమిని కోల్పోయాడు. పరిహారం కింద గుంటకు రూ.36 వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అదే సర్వే నంబర్లోని ఆరుగురు రైతులకు మాత్రం గుంటకు రూ.56 వేల చొప్పున పరిహారం అందింది.

దీంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ న్యాయం జరగలేదు. దీంతో పలుమార్లు రోడ్డు పనులను రైతు అడ్డుకున్నాడు. గురువారం సైతం నిర్మాణ పనులు అడ్డుకొని ఆందోళనకు దిగడంతో తహసీల్దార్ భాస్కర్ స్థానిక పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే తహసీల్దార్ కాళ్లపై పడి మిగతా పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు. వెంటనే పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news