కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. ఈ చట్టాలతో రైతులు మరింత కష్టాల్లోకి వెళ్తారని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు 25కుపైగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐఎఫ్‌యూ), భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ), ఆలిండియా కిసాన్ మహాసంఘ్ (ఏఐకేఎం) వంటి రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని రైతు సంఘాలతో పాటు పదికి పైగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించడం గమనార్హం.
అంతేగాకుండా.. ఆర్ఆర్ఎస్ అనుబంధ రైతు సంఘం కూడా కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలను వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా.. కేంద్రప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతుల నిరసన తీవ్రతరమైంది. ఇందులో భాగంగా మూడు రోజుల రైల్‌రోకో కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీంతో రైల్వే అధికారులు రాష్ట్రంలో రైళ్లను రద్దుచేశారు. 26వ తేదీ వరకు 14 జతల ప్రత్యేక రైళ్లను రద్దుచేసినట్టు ప్రకటించారు. ఈ పరిణామాలతో ప్రధాని మోడీకి కష్టకాలం మొదలైనట్టేనని పలువురు విశ్లేషకులు అంటున్నారు.