ఇప్పుడు అయితే.. 8 గంటలు పనిచేస్తున్నాం.. కానీ ఒకప్పుడు ఇలా కాదు.. ఇన్ని పనిగంటలు అని ప్రత్యేకంగా ఉండకపోవడంతో.. కొన్ని చోట్ల కార్మికులచేత రాత్రిబవళ్ళు పని చేయించే వారు.. ఈ రోజు ఉద్యోగం గానీ, ఏదైనా పనికి పోయిన… 8 గంటలు మాత్రమే పని వేళలు గుర్తించడానికి వెనుక ఎంతో మంది పోరాట శ్రమ ఉంది. ప్రపంచం ముందుకు నడవాలంటే కార్మికుడు కావాలి. అతడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకుంటున్నదే ‘మే డే’ ఈ రోజు వారి ఐక్యత, పోరాటానికి నిదర్శనం.
నిజానికి మే డే ఎలా వచ్చిందంటే.. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు. వారి రక్త తర్పణం ప్రపంచానికే కొత్త దిశను చూపింది. ఆ ఘటన తర్వాత 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 1923లో తొలిసారిగా భారత్‌లో ‘మే డే’ను పాటించారు.