కరోనా నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని, ముఖానికి మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలని, చేతులను ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు, వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ కొందరు ఆ మాటలను వినడం లేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతూ కోవిడ్ తెచ్చుకుంటున్నారు. అయితే ఆ వ్యక్తి మాత్రం అన్ని నిబంధనలను పాటించాడు. దీంతో ఆ గ్రామంలో అందరికీ కోవిడ్ వచ్చింది కానీ.. అతనికి మాత్రం రాలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లోని తొరాంగ్ అనే గ్రామంలో ఇటీవల ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. దాని వల్ల ఆ గ్రామంలో ఉండే 42 మందికి కరోనా వచ్చింది. ఆ గ్రామ జనాభా 43. అంటే కేవలం ఒక్క వ్యక్తికే కరోనా రాలేదన్నమాట. అతని పేరు ఠాకూర్. ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినప్పటికీ అతను కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాడు. అంతే కాదు, సాక్షాత్తూ తన సొంత కుటుంబ సభ్యుల దగ్గరికే వెళ్లలేదు. దీంతో అతనికి కరోనా సోకలేదు. ఇక ఆ కార్యక్రమానికి హాజరైన అందరూ జాగ్రత్తలు పాటించకపోవడంతో అందరూ కరోనా బారిన పడ్డారు. ఠాకూర్ తప్ప అతని కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది.
ఇక ఠాకూర్ ప్రస్తుతం ఆ గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. చిన్న నివాసంలో సొంతంగా వండుకుంటూ తింటున్నాడు. కరోనా తగ్గేవరకు తన గ్రామానికి వెళ్లనని అంటున్నాడు. కార్యక్రమంలో భాగంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని అందుకనే తనకు కరోనా సోకలేదని తెలిపాడు. కాగా ఆ గ్రామమే కాదు, అక్కడ చుట్టు పక్కల గ్రామాల్లోనూ ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.