బాంబే హైకోర్టు ఓ కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. శృంగారం చేయాలనే దురుద్దేశం లేకుండా బాలిక బుగ్గలను తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆ విధంగా చేయడం పోక్సో చట్టం కిందకు రాదని న్యాయమూర్తి తెలిపారు.
ముంబై సమీపంలోని థానె జిల్లాకు చెందిన రబోడి పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ 46 ఏళ్ల వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తన 8 ఏళ్ల కుమార్తెను అనుచిత రీతిలో తాకాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జూలై నెల నుంచి అతను జైలులో ఉన్నాడు. దీంతో అతనికి జస్టిస్ సందీప్ కె షిండే బెయిల్ మంజూరు చేశారు.
ఉద్దేశ్య పూర్వకంగా లేదా వేధింపులకు గురి చేయాలని, శృంగార కాంక్షతో, దురుద్దేశంతో తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. అలాంటి దురుద్దేశం లేకుండా సాధారణంగానే తాకితే అది లైంగిక వేధింపుల కిందకు రాదని తెలిపారు. అయితే నిందితుడికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ అతనిపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతుందని, దాన్నుంచి అతను తప్పించుకోలేడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.