రంగారెడ్డి జిల్లాలోని తాండూరు కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రిక్వెస్ట్ పేమెంట్ పంపిస్తూ వ్యాపారులను బురిడి కొట్టిస్తున్నారు. స్థానిక వ్యాపారుల కథనం ప్రకారం..ఓ గుర్తు తెలియని యువకుడు ఓ కిరణా షాపునకు వెళ్లి రూ.4600 విలువచేసే ఆయిల్ డబ్బాలు -2, మరో షాపులో రూ.4500 విలువ చేసే రెండు బియ్యం బస్తాలు, రూ.6వేల విలువైన ఒక సంతూర్ సబ్బుల కాటన్ తీసుకున్నాడు.
ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తానని నమ్మించి ఫోన్ పే ద్వారా వారికి అమౌంట్ పంపించినట్లు రిక్వెస్ట్ పెట్టాడు. వారికి డబ్బులు వచ్చినట్లు ఫోన్ పే స్వీకర్‌లో రిక్వెస్ట్ సౌండ్ మాత్రమే వచ్చింది. తీరా అకౌంట్ లో చెక్ చేయగా డబ్బులు రాలేదు. అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వ్యాపారులు వెంటనే స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అక్కడకు చేరుకున్న పోలీసులు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.