గ్రేటర్ హైదరాబాద్‌లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్‌పై విచారణ చేపట్టగా.. నవజాత శిశువును గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠా సభ్యుల ఆటను కట్టించారు. అదేవిధంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక నిందితురాలైన వందన ముఠా కోసం పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ బృందం గుజరాత్‌కు వెళ్లింది. చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ముఠా కోసం గుజరాత్‌లో రాచకొండ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. నిందితులతో పాటు పిల్లలను కొనుగోలు చేసిన నలుగురు దంపతులను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.