సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. నదిలోని ఒక పాయలో మేత కోసం వెళ్లిన పశువులను తోలుకోచ్చేందుకు వెళ్లిన యువకుడు సురుగాని అయోధ్య (20) నీటి ప్రవాహంలో కొట్టుకునిపోయాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని తమ్మారం గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం..తమ్మారం గ్రామ శివారు కృష్ణ నది ఒడ్డున ఉండటంతో ఆ గ్రామంలోని పశువులు కృష్ణ నది ఒడ్డుతో పాటు అందులోనూ ఒక పాయలోకి మేత కోసం వెళ్తాయని వెల్లడించారు. ప్రతిరోజూ ఎవరో ఒకరు పడవల ద్వారా లేక ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆ పాయల వద్ద మేస్తున్న ఆ పశువులను ఒడ్డుకు తోలుకోస్తారన్నారు.గురువారం సాయంత్రం పశువులను తోలుకు వచ్చేందుకు కృష్ణ నది వైపు వెళ్లిన అయోధ్య ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కృష్ణా నది వద్దకు వెళ్ళగా అక్కడ అతని చెప్పులను గుర్తించారు. నదిలో గల్లంతై ఉంటాడని గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం అతని మృతదేహం కృష్ణ నదిలో లభ్యమైందన్నారు.