ఎదిగాక కొందరే గుర్తుంటారు
ఎదిగేందుకు ఎందరో సహాయం అయి ఉంటారు
చేదోడు వాదోడు అన్నవి ఉపయుక్తం అయి ఉంటాయి
కానీ జీవితం మాత్రం ఎక్కడో ఓ దగ్గర నీ తప్పులను
గుర్తు చేస్తూనే ఉంటుంది.. నాయకుల తప్పులను
దోషాలను కాలం గుర్తు చేస్తూ చేస్తూ పరిహరిస్తూనే ఉంటుంది
ఆ కాల వాహిని చెంత నేను మరియు నా తెలంగాణ
ఆ ప్రవాహ ధర్మాల చెంత ఉరవడి చెంత నడవడి చెంత నాతో సహా ఎందరో !
నీళ్లు – నిధులు – నియామకాలు వీటి గురించే మాట్లాడాలి.. ఇవే ప్రధాన నినాదాలు.. ఉద్యమ రీతికి ఇవే ప్రధాన నియమాలు ఉద్యమ గీతికి.. వీటి వెనుక కొందరి కృషి ఉంది. ఆ రోజు నినాదాలు పలకడం ఒక్కటే కాదు గుణాత్మక రీతిలో విశ్లేషించిన మహనీయులు ఉన్నారు.. వారిని స్మరించాలి. ఇవాళ తెలంగాణ జల కళల ప్రదాత విద్యా సాగర్ సర్ వర్థంతి వారికి నివాళులు.
బాసర నుండి భద్రాచలం దాక నిలబడే ఉంది గోదారి…
ఒక్కసారైనా చూసిపోతరేమొనని…
మండుటెoడలల్ల నిండుచెర్లన్ని తొంగిచూస్తున్నయి
పలకరించి పోతరేమొనని
“జల” విద్యాసాగరా జోహార్…జోహార్.. – శ్రీనివాస్ పెద్దపల్లి
కేసీఆర్ ను చూస్తే కొంత కోపం కొంత బాధ కలుగుతాయి. ఎందుకంటే ఆయన తన గురువులను తల్చుకోవడం మానేశారు. ఆ రోజు ఉద్యమ కాలంలో విషయ నిపుణులను తలుచుకోవడం మానేశారు. ప్రాజెక్టుల గురించి, సైద్ధాంతిక భావ జాలం గురించి చెప్పిన వారెవ్వరినీ ఆయన స్మరించుకోవడం మానేశారు. ఆ విధంగా ఆయన ముగ్గురి ప్రస్తావన మరిచే పోయారు నిన్నటి ప్లీనరీలో ! ఒకరు కాళోజీ.. ప్రజాకవి. రెండు ప్రొఫెసర్ జయశంకర్..తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంత కర్త. ఉద్యమ రూపకర్త.ఆఖరి వాడు అని అనుకోలేం కానీ ఓ విధంగా ఈ త్రయంలో ఆఖరి వాడు విద్యా సాగర్. ప్రాజెక్టులకు సంబంధించి కరువు నేలలకు నీళ్లు తీసుకువచ్చే విషయమై ఆ రోజు కేసీఆర్ ను నడిపింది, ఉద్యమ స్ఫూర్తి రగిలించింది ఆయనే కానీ ఆయన పేరే ఎక్కడా ఇప్పుడు పలకరు. అదే పెద్ద విషాదం.
వాస్తవానికి ఉద్యమ రూపకర్తలలో ఎవరేంటి ఎవరేం చేశారు అన్నవి ఇప్పటికీ స్మరణలో ఉండాల్సిన విషయాలు. ఎప్పటికీ మరువరాని విషయాలు. కానీ ఆయనను స్మరించే తీరు మాత్రం తెలంగాణ వాకిట ఉందా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు గోదావరి నీళ్లు ఎలా వాడుకోవాలో లేదా కృష్ణమ్మ పరుగులను ఎలా అర్థం చేసుకోవాలో లేదా ప్రాణహిత ఉరవడిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలో ఏమయినా ఆలోచన ఉందా ? అవన్నీ కేసీఆర్ కు చెందిన విషయాలు అని ఊరుకుంటున్నారా లేదా మనకెందుకు అవి అర్థం కాని విషయాలు అని తప్పుకుంటున్నారా..?
ఇప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పన అన్నది అభివృద్ధికే ఓ తలమానికం. అందుకే కేసీఆర్ పదే పదే ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు వాటి వినియోగం, వ్యవసాయ రంగం బాగు పడిన తీరు గురించి కాళేశ్వరాన్ని ఉద్దేశించి చెబుతారు. మల్లన్న సాగర్ ను ఉద్దేశించి చెబుతారు. ఇంకా చెప్పాలంటే మిడ్ మానేరును ఉద్దేశించి చెబుతారు. వీటన్నింటి వెనుకా విద్యా సాగర్ అనే మహా విషయ నిపుణుడు ఉన్నారు అన్న సంగతి కనీసం ఆయా సందర్భాల్లో కూడా చెప్పరు. అదే బాధాకరం. వీటి వెనుక ఆ రోజు కృషి చేసిన జయశంకర్ సర్ పేరు కానీ ఇంకా చెప్పాలంటే ప్రజా బాహుళ్యంలో సమానత్వ రీతులను కోరుకున్న కాళోజీ లాంటి వారిని కానీ కుందుర్తి ఆంజనేయులు వంటి వచన కవులు గురించి కానీ ఆయన మాట్లాడరు. ఒక్క దాశరథిని మాత్రం స్మరిస్తారు.ఆయన పేరిట చేసే జయంతులు,వర్థంతులు మాత్రం బాగుంటాయి. మిగిలిన శక్తులు ఏమయిపోయాయో !
– రత్నకిశోర్ శంభుమహంతి