మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి.
నాగాలాండ్, మేఘాలయల్లో ఇప్పటికే ఒక్కో అసెంబ్లీ సీటు ఏకగ్రీవం అయ్యాయి. నాగాలాండ్‌లో 59 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 4 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. బుధవారం ఈ స్టేషన్లలో రీ పోలింగ్ జరిగింది. నాగాలాండ్‌లో ఎన్నికలు నిర్వహించిన 59 సీట్లకు 183 మంది పోటీ పడ్డారు. మేఘాలయలో 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో 259 మంది పోటీ పడ్డారు.
కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.